రైతు బంధు సంబురం అంబరాన్నంటుతున్నది. పల్లెల్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుండగా, అన్నదాత ఇంట ఆనందాలు పూయిస్తున్నది. ఐదేళ్లుగా దిగ్విజయంగా అమలవుతున్న పథకం పదో విడుత యాసంగి సాయం వారం రోజులుగా రైతన్న ఖాతాల్లోకి జమవుతుండగా, డబ్బులు డ్రా చేసుకొని మురిసిపోతున్నది. ఇప్పటివరకు 90శాతం మందికి దాదాపు రూ.500 కోట్లకు పైగా సాయం అందగా, బంగారు పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నది. కర్షకబాంధవుడు సీఎం కేసీఆర్ అని కీర్తిస్తూ, జేజేలు పలుకుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందిస్తున్న యాసంగి పెట్టుబడి సాయం వెనువెంటనే రైతన్న ఖాతాల్లో జమవుతున్నది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకుల్లో నగదును విడిపించుకుంటూ సాగు పనులకు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 6లక్షల మంది రైతులకు రూ.500 కోట్లకు పైగా సాయం అందగా, కర్షకలోకం సంబురపడుతున్నది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కీర్తిస్తూ, ఊరూరా జేజేలు పలుకుతున్నది.
– కరీంనగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం. నాకు ఎకరం భూమి ఉంది. ‘రైతుబంధు’ కింద నాకు ఏటా రూ.10 వేల సాయం అందుతుంది. వానకాలం, యాసంగి పంట పెట్టుబడులకు అక్కరకు వస్తున్నయ్. రైతు బంధు వచ్చిన దగ్గరి నుంచి ఎవుసం అల్కగుంది. అప్పుల కోసం తిరిగే బాధ తప్పింది. అప్పటి సమైక్య రాష్ట్రంలో మా రైతులను ఎవరూ పట్టించుకోలే. నరకం చూసినం. రైతు బంధు పైసలతో ఎరువులు కొంటున్న. కూలీలకు డబ్బులు ఇస్తున్న. ఇంత గొప్ప పథకాన్ని పెట్టిన కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంట. – గంగాధర మల్లన్న, రైతు (ధర్మారం)
మాది వెంకటాపూర్. భార్య రేణుక, ఇద్దరు కొడుకులు వేణు, తేజ ఉన్నారు. అందరం కలిసి వ్యవసాయం చేసుకుంటున్నం. ఇద్దరు కొడుకులను ఇంజినీరింగ్ చదివించిన. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో పని చేస్తున్నరు. సమయం దొరికినప్పుడు నాతో కలిసి పొలం పనులు చేస్తారు. నాకున్న ఆరెకరాల భూమిలో అంతా వరివేసిన. నాడు వ్యవసాయం చేయాలంటే షావుకారి వద్దకు పోయి చేయి చాపి అప్పు తెచ్చుకున్న. నాట్లకు కైకిలు, ట్రాక్టర్ కిరాయి, మందులు అరొక్కటి అప్పు చేసి తెచ్చుకున్న. వడ్లమ్మిన పైసల కోసం తిరిగి తిరిగి చెప్పులరిగేవి. తీసుకున్న అప్పు కట్టమని ఒత్తిడి ఉండేది. తెలంగాణ సర్కారు వచ్చినంక రైతుబంధు ఇస్తున్నది. 30వేలు వస్తున్నవి. కైకిలోళ్లకు అడ్వాన్స్‌గా పైసలు ఇస్తున్న. రైతుబంధుతో ఇగ మందులకు దేనికి అప్పులు తెచ్చే అవసరం లేకుండా పోయింది. కేసీఆర్ సార్ ఇతర పంటలెయ్యమని చెప్పినట్లు నాలుగెకరాల్లో వడ్లు, రెండెకరాల్లో బీర, కాకర, టమాట, మిర్చి, సోరకాయ పండిస్తున్న. రోజుకు రూ.2వేలు సంపాదిస్తున్నా. నీళ్లున్నయ్, కరెంటుంది. పంట దిగుబడి నాటికి నేటికీ రెట్టింపయింది. మా పిల్లల ఉద్యోగాల కంటే ఈ వ్యవసాయంలోనే లాభం కనిపిస్తున్నది. ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు టైం తీరినప్పుడు పొలంలోకి వచ్చి పనులు సేత్తున్నరు. చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు మంచి మేలు చేస్తున్నది. కేసీఆర్ సార్ చేసిన సాయాన్ని ఎన్నటికీ మరిచిపోం.
– మూడపల్లి మల్లయ్య, రైతు, వెంకటాపూర్ (ఎల్లారెడ్డిపేట)
నాది కోనరావుపేట మండలం మారుపాక. నాటి రోజుల్లో కరెంటురాదు. నీళ్లులేవు. వ్యసాయం చేద్దామంటే గోసపడ్డం. సమైక్యపాలనలో మనల్ని ఎవరు పట్టించుకోలేదు. పైగా వ్యవసాయం దండగంటూ హేళన చేసిండ్రు. పెట్టుబడి లేక నాకున్న రెండెకరాల పొలంతో పడరాని కష్టాలు పడ్డ. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో నేను పాల్గొన్నా. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తదో ఏమో అనుకున్నా. ఇయ్యాల సాగుకు పుష్కలంగా నీళ్లున్నయ్. పొద్దుమాపు కరెంటుంది. పెట్టుబడికి రైతుబంధు ఇస్తుండు. కేసీఆర్ సార్ జెయ్యబట్టి పంట పెట్టుబడికి డోకాలేదు. రెండెకరాలకు వచ్చిన 10వేలు లాగోడికే పెడుతున్నా. ఇగ వడ్లమ్మిన పైసలొస్తే మిగులు బాటే తప్ప ఖర్చులంటూ లేవు. రైతు రాజ్యం కండ్లముందే కనిపిస్తుంది. ఎందరినో చూసిన. ఇది జేత్తా అది జేత్తా అంటూ హామీలిచ్చి పత్తా లేకుంటా పోతరు. కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసి చూపిస్తుండు. మాలాంటి రైతుల కోసం ఆయన ఎప్పుడు సీఎంగా ఉండాలే.
– తుమ్మల దేవయ్య, మారుపాక (కోనరావుపేట).