హుజూరాబాద్ డివిజన్లో సీడ్ మిల్లు వ్యాపారుల నయా దందా తెరపైకి వస్తున్నది. బోనస్ చెల్లిస్తామని రైతుల నుంచి నెల క్రితమే సన్న వడ్లు సేకరించి.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా దోచుకునే ప్రయత్నం కనిపిస్తున్నది. పైగా బోనస్‌తో కలిపి విత్తనాలు విక్రయిస్తూ.. దోపిడీ చేస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. ఒక్కో 25 కిలోల బ్యాగుకు 150 చొప్పున క్వింటాల్‌కు అదనంగా 600 వరకు గుంజుతుండగా.. రైతులు రెండు విధాలా నష్టపోవాల్సి వస్తున్నది. ఈ విషయంలో కలెక్టర్ చొరవ చూపి ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతాంగం వేడుకుంటున్నది.
హుజూరాబాద్, జూన్ 9 : హుజూరాబాద్ డివిజన్ సీడ్ వరికి కేరాఫ్‌గా ఉన్నది. ఇక్కడ పండిన సన్న వడ్ల విత్తనాలకు క్వాలిటీ పరంగా ఇతర రాష్ర్టాల్లో చాలా డిమాండ్ ఉన్నది. ఏటా సీజన్లలో ఇక్కడి సీడ్మిల్లు వ్యాపారులు ధాన్యం సేకరించి, మిల్లుల్లో శుద్ధి చేసి విత్తనాలుగా విక్రయిస్తున్నారు. మొన్నటి యాసంగిలోనూ సాగు చేసిన వరిలో సగానికిపైగా విత్తనాల కోసం ధాన్యం సేకరించారు. అయితే, ప్రభుత్వం సన్నాలకు 500బోనస్ ఇస్తానని ప్రకటించడంతో మద్దతు ధర 2,320కు బోనస్ కలిపి 2820 ఇస్తామని చెప్పి ధాన్యం తీసుకున్నారు. ఇలా సుమారు 2వేల మంది రైతుల నుంచి 40 వేల టన్నుల వరకు సేకరించారు. అత్యవసరమున్న కొందరు రైతులకు మాత్రం 2500 చొప్పున చెల్లించినా.. మిగతా రైతులకు ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వంతో ఏం సంబంధం లేకున్నా సీడ్ వ్యాపారులు మాత్రం బోనస్ చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయడాన్ని సాకుగా చూపి ఇవ్వడం లేదు. బోనస్ ఇవ్వకపోగా వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో దోపిడీకి తెరలేపారు. బోనస్‌తో కలిపి విత్తనాల ధర నిర్ణయించి విక్రయించడం మొదలు పెట్టారు. వ్యాపారులు మాత్రం డబుల్ బోనస్ పొందుతూ, రైతులకు మాత్రం మొండి చేయిచూపే ప్రయత్నం చేస్తున్నారు.
రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యాన్ని శుద్ధి చేసి 25 కిలోల చొప్పున బ్యాగులో నింపుతారు. దానికి కొంత లాభం చూసుకొని వ్యాపారులు ధర నిర్ణయించి విక్రయిస్తారు. గతేడాది ఇతర రాష్ర్టాల్లో 25 కిలోల విత్తన సంచికి 1249 ధర ముద్రించి విక్రయించారు. మన లోకల్ మార్కెట్లో మాత్రం 900 నుంచి 950 వరకు అమ్మారు. అప్పుడు ప్రభుత్వం బోనస్ ప్రకటించలేదు. అయితే, ఈ యేడు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు సీడ్ మిల్ యజమానులతో ప్రభుత్వం ఇస్తున్నట్టు బోనస్‌తో కలిపి 2820 చెల్లిస్తేనే ధాన్యం విక్రయిస్తామని చెప్పారు. దీంతో సీడ్మిల్ యజమానులు ధర పెంచారు. 25 కిలోల విత్తన సంచికి 1449 ధర నిర్ణయించారు. ఈ మేరకు ఇతర రాష్ర్టాల్లో ఫర్టిలైజర్ అండ్ సీడ్ దుకాణాల వ్యాపారులు కొంచెం అటీటుగా ఇదే ధరకు విక్రయిస్తుండగా.. స్థానిక మార్కెట్లో మాత్రం 1050 నుంచి 1100 వరకు విక్రయిస్తున్నారు. గతేడాది ధరతో పోలిస్తే 150 అద నం కాగా, క్వింటాల్‌కు 600 లాభం పొందుతున్నారు.
ప్రభుత్వం బోనస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండడంతో సీడ్ వ్యాపారులు ధర విషయంలో కొరివి పెడుతున్నారు. బోనస్‌తో కలిపి విత్తనాలను విక్రయిస్తున్నా రైతులకు మాత్రం ఆ ధర ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నారు. అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వకుండా.. విత్తన వడ్లకు బోనస్‌తో కలిపి విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. వడ్లు అమ్మి నెల దాటినా డబ్బులు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమై డబ్బులు అడిగితే ఎంతో కొంత ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. క్వింటాల్‌కు 2820 బదులు 2500 ఇస్తామని అంటున్నారని, కొందరు వ్యాపారులైతే కేవలం మద్దతు ధర అంటే 2,320 ఇస్తామని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, వ్యాపారుల దగ్గరి నుంచి బోనస్‌తో కలిపి డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.