మెట్పల్లి/ మారుతీనగర్/ మేడిపల్లి, ఆగస్టు 29 : రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు చెందిన వందలాది మంది రైతులు గురువారం మెట్పల్లిలో అఖిల పక్ష రైతు మహాధర్నా చేశారు. అటు మేడిపల్లి మండల కేంద్రంలోనూ ఉమ్మడి మేడిపల్లి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో చేశారు. మాటిచ్చి తప్పిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయాచోట్ల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందంటూ రైతులు మండిపడ్డారు.
ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షలు వరకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 పంటకు పెట్టుబడి సాయం అందించాలని, ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన చరిత్ర దేశంలో ఒక్క తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తప్ప మరెవరికీ లేదని విమర్శించారు. రైతులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా, రైతులను విస్మరిస్తుందని, రాబోయే రోజుల్లో గెలిపించిన రైతులే మళ్లీ బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.