ఆర్టీసీ లాజిస్టిక్స్ లాభాల బాటలో నడుస్తున్నది. ప్రయాణికులను చేరవేర్చడమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనలతో ప్రారంభం కాగా, అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. గతంలో ప్రైవేట్ సంస్థతో నిర్వహించిన కార్గోను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి ‘లాజిస్టిక్’గా పేరు మార్చి సేవలందిస్తున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలో అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. అంతే కాకుండా, జూలైలో రాష్ట్రంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఆదాయంలో మెరుగైన స్థానంలో ఉన్నా అరకొర వసతులతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది.
కరీంనగర్ తెలంగాణ చౌక్, ఆగస్టు 8 : కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ కేంద్రాలు జూలైలో 75 లక్షల ఆదాయాన్ని గడించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 1500 పార్సిల్ బుకింగ్ అవుతుండగా, కేవలం కరీంనగర్ నుంచే 800 నుంచి వెయ్యి వరకు వివిధ ప్రాంతాలకు బుక్ అవుతున్నాయి. రీజియన్ పరిధిలో 37 కౌంటర్లు ఉండగా, కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్, గోదావరిఖని, సిరిసిల్ల ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తుండగా, ఇవి 24గంటలు సేవలందిస్తున్నాయి. మిగతా 32 కౌంటర్లను ప్రైవేట్ కార్గో కౌంటర్ (పీసీసీ) పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సెంటర్లో 26 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా, అందులో 13 మంది ఆర్టీసీ ఉద్యోగులు కాగా, మరో 13 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు.
బస్సుల నుంచి వచ్చే వస్తువుల దిగుమతి, ఎగుమతి కోసం షిఫ్ట్‌కు 10 మంది హమాలీలు మూడు షిఫ్ట్‌లు పని చేస్తున్నారు. ముఖ్యంగా సీడ్స్ కంపెనీలు, విద్యా సంస్థలు, మెడికల్ ఏజెన్సీలు, బట్టల వ్యాపారులతోపాటు ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు లాజిస్టిక్ సేవలను వినియోగించుకుంటున్నారు. త్వరలో బల్క్ బుకింగ్ చేసే వ్యాపారుల నుంచి పికప్, డెలివరీ చేసేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 19న రాఖీ పౌర్ణమి సందర్భంగా కరీంనగర్‌లోని లాజిస్టిక్ కేంద్రంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు తమ సోదరులకు పంపించే రాఖీలు, స్వీటు బాక్స్‌లు, గిఫ్ట్‌లు బుకింగ్ చేసిన తర్వాత ఇచ్చిన చిరునామాకు 24 గంటల్లో చేరవేర్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
కరీంనగర్‌లోని లాజిస్టిక్ కేంద్రానికి ప్రతి రోజూ వెయ్యి పార్సిళ్లతో 1.50 లక్షల ఆదాయం వస్తున్నా కనీస వసతులు కల్పించడం లేదు. 24 గంటల సేవా కేంద్రం కావడంలో రాత్రి 12 గంటల వరకు రద్దీ కొనసాగుతుంటుంది. అయితే, ఇక్కడ మంచినీటి వసతి, కూర్చోడానికి బెంచీలు లేక వినియోగదారులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు లేక పోవడంతో పురుషులతో పాటే లైన్లలో నిల్చుంటూ ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వస్తువులను భద్ర పరిచే గోదాంలు లేక పోవడంతో లాజిస్టిక్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలంలో ఇష్టానుసారంగా పెడుతున్నారు. దీంతో విలువైన వస్తువులు పాడువుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఆర్టీసీ లాజిస్టిక్ సేవలను ప్రజలు ఆదరిస్తున్నారు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. వస్తువు బుకింగ్ చేయగానే తీసుకునే వారికి సెల్లో మెసేజ్ వస్తుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వస్తువు ఎప్పుడు చేరుకుంటుందో తెలుసుకోవచ్చు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తమ సోదరులకు పంపించే రాఖీలు పట్టణ ప్రాంతాలకు 24 గంటల్లో చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని లాజిస్టిక్ కేంద్రంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బస్టేషన్ డిపో-1 ఆవరణలో కొత్త లాజిస్టిక్ కార్యాలయ భవనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
– రామారావు, కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ మేనేజర్