ఆర్టీసీలో నవశకం మొదలు కాబోతున్నది. 91 ఏండ్ల సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేబినెట్ నిర్ణయించడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, వేలాది మందికి ఉద్యోగ భద్రత కల్పించనున్నది. ఇన్నాళ్లూ కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితమైన ఉద్యోగులు, ఇకపై ప్రభుత్వోద్యోగులుగా మారేందుకు అడుగు పడింది. ఇదే సమయంలో సంస్థకు జవసత్వాలు వచ్చే అవకాశమున్నది. ప్రజా రవాణా మరింత మెరుగు పడడంతోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పూర్వవైభవం రానున్నది. లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన సేవలందేందుకు ఆస్కారం ఏర్పడింది. మొత్తంగా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పడంతో ఉద్యోగుల కుటుంబాల్లో అంతులేని అనందం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఆగస్టు1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి అన్ని విధాలా అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారు, మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నది. సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సోమవా రం హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించిం ది. ఇకపై ఆర్టీసీలో ఇక నవశకం మొదలు కానుండగా, ఉద్యోగులకు భద్రత లభించడమే కాదు, ప్రజారవాణా మరింత మెరుగుపడనున్నది. దీంతోపాటే అన్ని వర్గాలకూ ప్రయోజనం చేకూరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నాటి పాలన నుంచే నిర్వీర్యం
ఆర్టీసీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1999లో ప్రపంచంలోనే ప్రభుత్వ రంగ పరిధిలో నడుస్తున్న అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్‌బుక్‌లో చోటు ద క్కించుకున్నది. ఇదొక్కటే కాదు, అనేక అవార్డులను తన ఖాతా లో వేసుకున్నది. ఒకనాడు విస్తృత సేవలందించి లాభా ల బాటలో నడిచి న ఈ సంస్థ, నాటి పాలన నుంచి నిర్వీర్యం గా మారుతూ వచ్చింది. రానురానూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నది. కొన్ని యూనియన్లు.. కార్మికులను ప క్కదారి పట్టించడం, దీంతో ఆకస్మిక సమ్మెలకు దిగడం, బస్సులు నిలిచిపోవడం, ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్టువైపు ఆకర్షితులు కావడం.. వంటి కారణాలతో ఆర్టీసీకి ఆదరణ తగ్గిపోయింది. ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతూ వచ్చింది. దీంతో లాభాల బాటలో ఉన్న అనేక డిపోలు ఒక్కొక్కటిగా నష్టాల్లో కూరుకుపోయాయి.
స్వరాష్ట్రంలో ప్రోత్సాహం
తెలంగాణ ఆర్టీసీ సైతం అదే బాటలో నడిచింది. పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్, సంస్థను గాడిన పెట్టేందుకు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2019లోనే ఆర్టీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి, లాభాల బాట పట్టించేందుకు పలు చర్యలను తీసుకున్నది. అంతేకాదు, చాలా మంది కార్మికులను వివిధ ఉద్యోగాల్లో రెగ్యులర్ చేసింది. మహిళా కండక్టర్లకు డే డ్యూటీలు మాత్రమే వేసేలా చేసింది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రోత్సాహం అందించింది. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ.. ఆనైలైన్ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఆర్టీసీతో కలిసి పనిచేసింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కొరియర్ వ్యవస్థను రద్దు చేసి.. ఆర్టీసీయే స్వయంగా 2020 జూన్ నుంచి కార్గో వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
సాహసోపేత నిర్ణయం
రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలతో ఆర్టీసీ కొంత గాడిన పడినా ఆశించిన స్థాయిలో ముందుకెళ్లలేకపోయింది. దీంతో తిరిగి కార్మికుల్లో ఆందోళన మొదలైంది. నష్టాలు ఇలాగే పెరుగుకుంటూ వెళ్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండకపోవచ్చన్న అనుమానం వ్యక్తమైంది. సదరు కుటుంబాల్లో నిత్యం ఆందోళన కనిపించింది. ఈ పరిస్థితులను అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (జూలై 31న) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈనెల 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అందుకు సంబంధించి ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిజానికి ఆర్టీసీ 91 ఏళ్ల చరిత్రలో ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు. అంతేకాదు, ఇది కేవలం ము ఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందని కొనియాడుతున్నారు. సీఎం తీసుకున్న ఈనిర్ణయంతో ముందుగా తమకు ఉద్యోగ భద్రత లభించడంతోపాటు తమ కుటుంబాల్లో నైతిక ైస్థెర్యం పెరిగిందని చెబుతున్నారు. ఆర్టీసీ వర్క్‌షాపును కలుపుకొని కరీంనగర్ రీజియన్‌లో 3,931 మందికి మేలు చేకూరుతుందని సంతోషపడుతున్నారు.
ఇక నుంచి నవశకం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా పట్టుబడితే దాని ప్రక్షాళన చేసేంత వరకు విడిచిపెట్టరన్న పేరున్నది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రక్షాళన దిశగా పడే ప్రతి అడుగూ ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొచ్చే అవకాశమున్నది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం రవాణా రంగంలో నవ శకానికి బాటలు వేయనున్నది. ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు కానున్నది. ఇన్నాళ్లూ ఆర్టీసీ ఒక కార్పొరేషన్‌గా ఉండడం వల్ల.. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంటే వివిధ రకాల అడ్డంకులు ఏర్పడేవి. దీని వల్ల ముందుకు అడుగువేయలేని పరిస్థితి ఉండేదన్న అభిప్రాయాలున్నాయి. సంస్థ నష్టాల బాటలో నడిచేందుకు ఇది ఒక కారణమన్న వాదనలున్నాయి. కానీ, ఇక నుంచి ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడానికి ఆస్కారముంటుంది.
అంతేకాదు, ఆర్టీసీని ప్రక్షాళన చేసి ఒక గాడిలో పెట్టడమే కాదు, ప్రజల మన్ననలు పొందేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టే అవకాశమున్నది. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించి.. ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు అన్ని శాఖల అధికారులను వినియోగించుకోవడానికి ఆస్కారముంటుంది. ఉదాహరణకు ప్రైవేటు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తీసుకెళ్తుండడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నది. ఇక ముందు వీటిని అరికట్టడం వల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ప్రజా రవాణాకు పెద్దపీట వేయడం, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టే అవకాశమున్నది. అలాగే ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం వల్ల అందరికీ తక్కువ ధరలో రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది.
మెరుగుపడనున్న రవాణా
ప్రస్తుతం కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11డిపోల్లో సుమారు 900 బస్సులు నిత్యం మూడు నుంచి నాలుగు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఆర్టీసీ ప్రభుత్వం పరిధిలోకి వస్తే ప్రజా రవాణా పూర్తి స్థాయిలో మారిపోతుంది. బస్సుల సంఖ్య మరింత పెరిగి, అదనపు కిలోమీటర్లు తిరిగే అవకాశముంటుంది. ఫలితంగా మూ రుమూల పల్లెలకు రవాణా సౌకర్యం కలుగుతుంది. మరోవైపు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 18వేలమంది బాలికలకు ఉచిత రవాణా సౌకర్యం ఉండగా, భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరగనున్నది. దాదాపు 23వేల మంది వికలాంగులు లబ్ధిపొందుతుండగా, వీరి సంఖ్య కూడా పె రుగనున్నది. వీరితోపాటు జర్నలిస్టులు, నెలవారీ బస్‌పాస్‌లు తీసుకునే విద్యార్థులకు మరింత మేలుచేకూరే అవకాశముంటుంది.
91 ఏండ్ల చరిత్ర
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు 91 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు నిజాం కాలంలో 1932 జూన్‌లో రోడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ప్రారంభమైంది. 3.93 లక్షల మూల పెట్టుబడితో.. మూడు డిపోలు, 27 బస్సులు 166 మంది కార్మికులతో ప్రస్థానం మొదలైంది. 1951 నుంచి 1958 వరకు హైదరాబాద్ రాష్ట్ర రవాణా సంస్థగా నడిచింది. ఆ తదుపరి 1958 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది. తెలంగాణ అవతరణతో టీఎస్ ఆర్టీసీగా మారిపోయింది. 2015 మే 14న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం కాబోతున్నది. అందుకు సంబంధించి సోమవారం (జూలై 31న) జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నది.
సగౌరవం కల్పించిన్రు
ఆర్టీసీ సంస్థ నా కన్నతల్లిలాంటిది. ఎన్నో ఏండ్ల నుంచి సంస్థను నమ్ముకుని బతుకుతున్నం. సీఎం కేసీఆర్ మూడేండ్ల క్రితం కార్మికులు అన్న పదం తొలగించి, ఉద్యోగులు అని మార్చి సగౌరవం కల్పించిన్రు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి మేము మా వంతు సహకారం అందిస్తాం. సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులం కష్టపడి పని చేసి సంస్థను లాభాల బాటలో నడిపిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేం. సంస్థను ఇలానే కాపాడుకుంటూ ముందుకు వెళ్తాం.
– ఆడెపు మంజుల, కండక్టర్, జగిత్యాల డిపో
పండుగ కానుకలా ఉంది
సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయడం మాకు పండుగ కానుకలా ఉంది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. పండుగల రోజు చేసుకునే సంబురాలను ఇప్పుడే చేసుకుంటున్నం. ఎంతో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో మా జీవితానికి భరోసా కలిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం అందించే అన్ని అలవెన్సులు పొందుతం. మా కుటుంబమంతా జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– తూము సంతోషి కుమారి, కండక్టర్, కరీంనగర్ డిపో-1
ఆర్టీసీ కాపాడింది కేసీఆరే
నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని రెండేండ్లలో రూ.500 కోట్లు, మరో రెండేండ్లు రూ. 1500 కోట్లు ఇచ్చి కాపాడింది సీఎం కేసీఆరే. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఏర్పా టు తరువాత కార్మికులకు 44 శాతం పీఆ ర్సీ ఇచ్చిన్రు. కొత్త రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులను అధిక మించిన నాయకుడు. కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఆర్టీసీ కార్మికుల న్యాయం చేస్తాడనే నమ్మకం ఉండేది. కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని భరించి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యావాదాలు.
– బొగ్గోని తిరుపతి, కంట్రోలర్, కరీంనగర్(తెలంగాణచౌక్)
వేలాది మంది జీవితాల్లో వెలుగులు
వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపి సీఎం కేసీఆర్ దేవుడైండు. ఇలాంటి నిర్ణయం మరెవ్వరి వల్లా సాధ్యం కాదు. కార్యికుల కష్టాలు తెలిన నాయకుడికే సాధ్యం. గత ప్రభుత్వాలు తీసుకోని నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఎదురు చూసిన కోరిక నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు రావడంతో సర్వీసుపై భరోసా కలిగింది. ఇకపై సంస్థ కోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉన్నం.
– లక్ష్మారెడ్డి, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్ కరీంనగర్ డిపో-2(తెలంగాణచౌక్)
ముఖ్యమంత్రిది గొప్ప నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు తీసిపోని విధంగా పనిచేస్తున్న మమ్ములను ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారన్న ఆశతో ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రకటించడంతో దశాబ్దాల కల నెరవేరింది. ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ముఖ్యమంత్రికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులం జీవితాంతం రుణపడి ఉంటం.
-నీరటి సురేఖ, ఆర్టీసీ ఈడబ్ల్యూబీ మెంబర్, కండక్టర్, (హుజురాబాద్‌టౌన్)
వెలుగులు నింపిన మహానుభావుడు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు సీఎం కేసీఆర్. రాష్ట్రం రాకముందు దుర్భరంగా ఉన్న ఆర్టీసీని ప్రగతి పథంలో పయనించేలా చేసిన్రు. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులతోపాటు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె అన్ని బెనిఫిట్స్ కలుగుతయ్. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం 43 వేల మంది కుటుంబాలకు ఒక భరోసా దక్కుతుంది.
-రెడ్డి రాజేందర్‌రెడ్డి, డీసీ ఆయిల్ సూపర్వైజర్, (హుజురాబాద్‌టౌన్)
దేశ్‌కి నేతగా ఎదుగుతరు
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వరాష్ట్రం వచ్చే వరకు ప్రజల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ లాగా పట్టించుకున్న నాయకుడు లేడు. ఎంతో ముందుచూపు ఉన్న ఆయన దేశ్‌కి నేతగా, భావి భారత ప్రధానిగా ఎదుగుతరు. మా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను కడుపున పెట్టుకుని చూస్తున్న ఆయనకు మేం ఎల్లవేళలా అండగా ఉంటాం.
– సీహెచ్ యూపీరెడ్డి మెకానిక్, ఆర్టీసీ డిపో, (హుజురాబాద్‌టౌన్)