ఇల్లంతకుంట, మార్చి 15: మానకొండూర్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ విషయంలో దాదాపు రూ.50 లక్షల కుంభకోణం జరిగినట్లు సమాచారం ఉందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించి ఎమ్మెల్యే తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ల విషయంలో చీకటి దందా చేస్తున్నారని, రాబంధులుగా మారి బాధితులకు చెక్కులు అందకుండా మింగేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కనుసన్నల్లో సీఎంఆర్ఎఫ్ సాయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మూడు రోజుల క్రితం రహీంఖాన్ పేటలో కే రవి పేరుమీద పక్కదారి పట్టగా, ఇందుకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తు గ్రామానికి చెందిన ఓ కార్యకర్తను నుంచి బహిష్కరించి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. తాజాగా వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎల్ శ్రీనివాస్ పేరున వచ్చిన రూ.26 వేల చెక్కును మరో గ్రామానికి చెందిన ఎల్ శ్రీనివాస్ పేరున ఖాతాలో జమ చేయించి, ఓ నాయకుడు ఫోన్ పే చేయించుకున్నాడని ఆరోపించారు. ఈ చీకటి దందా వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, అందుకే ఎవరూ నోరు మెదపడం లేదన్నారు. అసలు దొంగలను కాపాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న చిన్న కార్యకర్తలను బాధ్యుల్ని చేయడం చూస్తుంటే ఇందులో ఎమ్మెల్యే హస్తం లేదా..? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొల్లం వెంకన్న, సాదుల్, కొట్టె వెంకన్న, ఒల్లాల రవి, కూనబోయిన రఘు, దయ్యాల మహేశ్, కూస నరేశ్, సదువాల పరుశరాం, సతీష్, రాములు, మొండయ్య ఉన్నారు.
వచ్చే నెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు
కమాన్చౌరస్తా, మార్చి 15 : ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కరీంనగర్ జిల్లా విద్యాధికారి సీహెచ్ వీఎస్ జనార్ధన్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ సూల్ కోఆర్డినేటర్ చలువాజి నాగేశ్వర రావు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు పొందిన, రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు, పరీక్షల రుసుంను అధ్యయన కేంద్రాలలో చెల్లించి, హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు.