Vyalla Harish Reddy | గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీకి చెందిన భూ దందాలో ప్రతిరోజు రూ.35 లక్షల వరకు చేతులు మారుతున్నాయని, ఈ వ్యవహారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా తయారవుతున్న బూడిద కుందనపెల్లి సమీపంలోని చెరువులో నిలువ చేస్తూ వాటిని అమ్మకాలు సాగించడం ద్వారా పెద్ద మొత్తంలో దందా నడుస్తుందని, ఈ దందా ద్వారా రోజుకు రూ.35 లక్షల వరకు అవినీతి జరుగుతుందని, ఈ వ్యవహారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. కుందనపల్లి బూడిద చెరువు వద్దకు ఎవరూ వెళ్లిన వారిని అడ్డుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పోలీసులను అడ్డుపెట్టుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కేసులు నమోదు చేయడం ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నవారు ఈ దందాలో నేరుగా వ్యవహారం నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే తాను ఒక సత్యహరి చంద్రుడిగా పేర్కొంటూ నల్ల దందాలకు పాల్పడుతున్నాడని, దీనిని కప్పిపుచ్చుకునేందుకు గోదావరిఖని పట్టణంలో రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలు చేస్తూ అభివృద్ధి జపం ఆలపిస్తున్నాడని స్పష్టం చేశారు. బూడిద దందా వ్యవహారంలో రామగుండం ఎన్టిపిసి అధికారులకు సంబంధం ఉందని, ఈ విషయంలో తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే విధంగా కుందనపల్లి చెరువులో బూడిద నింపుతూ మత్స్యకారుల కడుపుకొట్టారని దళితులకు బూడిద టెండర్ ఇవ్వాలని, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన వాటిని పాటించడం లేదని కోర్ట్ ఆఫ్ కంటెంట్ కింద వీరందరిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
రామగుండంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ నగరం మరింత కాలుష్యరహితంగా మారే అవకాశం ఉందని, కేవలం 100 మంది ఉద్యోగాల కోసం లక్షలాదిమంది జీవితాలతో రామగుండం ఎమ్మెల్యే ఆడుకుంటున్నాడని ఆయన విమర్శించారు. రామగుండం ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి నిధులను దుబారా చేస్తూ కోట్లాది రూపాయలను ఫుట్ బాల్ ఆటల పేరుతో దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. కోట్లాది రూపాయలను వృథా చేసే బదులు రైతులకు రైతుబంధు ఇవ్వడం ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం చేయాలని ఆయన సూచించారు.