కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్, (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఒకే రోజు ఏకంగా 1100 కోట్ల పనులకు అంకురార్పణ చేశారు. కరీంనగర్, చొప్పదండిలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ముందుగా నగరంలో ఒక్కరోజే మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పాడి కౌశిక్‌రెడ్డి, రఘోత్తం రెడ్డితో కలిసి 1030 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నగరంలోని మానేరు వంతెన వద్దకు చేరుకున్న అమాత్యుడు, 410 కోట్ల వ్యయంతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే నిర్మించిన మిషన్ భగీరథ పైలాన్‌తోపాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ర్యాలీగా మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌కు వెళ్లి, నగరంలో 615 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం చొప్పదండి పట్టణానికి వెళ్లి 38కోట్ల నిధులతో ఏర్పాటుచేసే సెంట్రల్ లైటింగ్‌తోపాటు ఇతర పనులను కలుపుకొని మొత్తంగా 78 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయ మార్కెట్లో 1.42కోట్లతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత తిరిగి సాయంత్రం మళ్లీ కరీంనగర్‌కు చేరుకున్నారు. పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్వల పార్కు సమీపంలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను, అందులో డిజిటల్ స్క్రీన్స్‌ను ప్రారంభించారు. ఇంత మంచి సదుపాయాలతో స్టడీ సర్కిల్‌ను నిర్మించిన మంత్రి గంగుల కమలాకర్‌ను అభినందించారు. చివరగా తెలంగాణ గ్రూప్-1 సంఘం, శాతవాహన ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న అవగాహన సదస్సు పోస్టర్‌ను ఐటీ టవర్‌లో ఆవిష్కరించారు. అక్కడే కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎల్ఎండీలోని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయంలో టీ విరామం తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.