కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో గోల్మాల్ బయటపడుతున్నది. బల్దియా పాత మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో నిర్మించిన ఐడీఎస్ఎంటీ కమర్షియల్ కాంప్లెక్స్ భవన ఆధునీకరణ పనుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు రికార్డు చేస్తున్నట్టు తెలుస్తున్నది. టెండర్లలో సూచించిన పనులకు అధికంగా వ్యయమైనట్టుగా రికార్డులు సిద్ధం చేసి, ప్రజాధనం లూటీ చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పెట్టిన బిల్లుల్లో కొన్ని పనులకే రూ.63 లక్షల బిల్లు అయినట్టు చూపించడంతోపాటు మిగిలిన ఇతర పనుల పేరిట కొత్తగా మరో రూ.60 లక్షల బిల్లుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ పని ఈజీగా అయ్యేందుకు పనులు జరిగిన టైంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులతో ఫైల్‌పై సంతకం చేయించేందుకు యత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే అక్రమాల బాగోతం బయటపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరీంనగర్ కార్పొరేషన్, జూలై 8: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఎస్ఎంటీ కమర్షియల్ కాంప్లెక్స్ భవన ఆధునీకరణ కోసం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నిధుల నుంచి రూ.63 లక్షలు కేటాయించి టెండర్లు పిలిచారు. ఓ సంస్థ టెండర్ దక్కించుకొని పనులు పూర్తి చేసింది. అయితే పనులు రికార్డు చేసిన బిల్లుల్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చేసిన పని కంటే అత్యధికంగా నమోదు చేసినట్టు, టెండర్లలో పిలిచిన మొత్తానికి మించి బిల్లులు రికార్డు చేసేందుకు యత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే టెండర్లో పిలిచిన మొత్తం పనులకు కాకుండా, కొన్నింటికే రూ.63 లక్షల బిల్లు రికార్డు చేశారని, సదరు ఫైల్‌పై ఉన్నతాధికారుల సంతకాల కోసం ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఆధునీకరణలో మట్టి పనులు, పెయింటింగ్, ఎలక్రిక్టల్స్, సివిల్, ఇతర పనులు చేపట్టాల్సి ఉన్నది. మట్టి పనుల కోసం సుమారుగా రూ.4.50 లక్షలు కేటాయించగా, దీనికి రెండింతలు సుమారుగా రూ.10 లక్షల మేరకు బిల్లులు చేసినట్టు తెలిసింది. వీటితో పాటు సీసీ పనులు, పైప్‌లైన్ పనుల్లోనూ భారీగానే బిల్లులు చేశారని తెలుస్తున్నది. సుమారుగా రూ.16 లక్షలకుపైగా పెయింటింగ్ పనుల కోసం, మరో రూ.2 లక్షలు ఎలక్ట్రికల్ పనుల కోసం కేటాయించారు. కాగా, ప్రస్తుతం రికార్డు చేసిన బిల్లులో వీటికి సంబంధించి వివరాలను నమోదు చేయలేదన్న గుసగుసలు ఇంజినీరింగ్ విభాగంలో వినిపిస్తున్నాయి.
టెండర్లలో సూచించినట్టు అన్ని పనులకు సంబంధించిన బిల్లులు పెట్టకుండా కేవలం మట్టి, సివిల్, ఇతర పనులకే టెండర్ అమౌంట్ అయినట్టు బిల్లుల్లో రికార్డులు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా పెయింటింగ్, ఎలక్ట్రికల్స్, ఇతర పనుల పేరుతో కొత్తగా మరో రూ.60 లక్షల మేర బిల్లులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. టెండర్ బిల్లులపై ఉన్నతాధికారుల సంతకాలు కాగానే, బిల్లులను మరో విధానంలో డ్రా చేసుకునేందుకు ఏర్పాట్లు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఫైల్స్‌పై సంతకాలకు ప్రయత్నాలు!
ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులకు సంబంధించి రికార్డు చేసిన బిల్లుల ఫైల్‌పై బల్దియా నుంచి బదిలీ అయిన ఇంజినీరింగ్ ఉన్నతాధికారుల సంతకాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కాగా, ఈ పనులు జరిగిన టైంలో బల్దియాలో విధులు నిర్వహించిన ఓ ఉన్నతాధికారి ఈ బిల్లుల్లో లోపాలు ఉన్నాయన్న అనుమానంతో సంతకాలు చేసేందుకు నిరాకరించినట్టు సమాచారం. దాంతో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండి ఇక్కడి నుంచి బదిలీ అయిన మరో ఉన్నతాధికారిని సంప్రదించి, అతని పీరియడ్‌లో పనులు సాగినట్లు రికార్డులు సిద్ధం చేసి సంతకాలు చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది. దీని కోసం తమ అనుకూల అధికారి విధుల్లో ఉన్న సమయంలోనే పనులు అయినట్టు ఫైల్స్‌లో తేదీల మార్పులు చేసి సంబంధింత అధికారికి పంపినట్టు సమాచారం.
ప్రస్తుతం పెట్టిన బిల్లులో ఆయా పనులకు అయిన వ్యయాన్ని చూపించకుండా కొన్ని పనులకే రూ.63 లక్షల బిల్లు అయినట్టు చూపించడంతోపాటు కొత్తగా మరో రూ.60 లక్షల బిల్లుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లుల విషయంలో ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బంది కీలకంగా మారి ఫైల్స్ కాంట్రాక్టర్లకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పనుల విషయంలో జిల్లా యంత్రాంగం దృష్టి సారించి చర్యలు చేపడితే అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయంపై నగరపాలక సంస్థ ఇన్చార్జి ఈఈ లచ్చిరెడ్డిని వివరణ కోరగా, ఈ ఫైల్ ఇంకా తమ వద్దకు రాలేదని, పనులు జరిగినప్పుడు ఉన్న ఈఈ స్థాయి అధికారుల సంతకాలు కాలేదని తెలిసిందన్నారు. బిల్లుల రికార్డుకు సంబంధించి తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. అప్పటి ఈఈ స్థాయి అధికారుల సంతకాల తర్వాత బిల్లుల కోసం ఫైల్ వస్తుందని పేర్కొన్నారు.