సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో రిఫ్లెక్టివ్ స్టిక్కరింగ్లు కీలకంగా మారాయి. రవాణా శాఖ నిబంధనల మేరకు వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్‌లు అమర్చితే చీకట్లో వాహనాలు స్పష్టంగా కనిపించడంతో యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇకపై యెల్లో నెంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలన్నీ కచ్చితంగా స్టిక్కరింగ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఫిట్నెస్ చేయాలంటే మోటార్ వాహన చట్టం 1988లోని నిబంధనల ప్రకారం ప్రతీ రవాణా వాహణానికి రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అతికించుకోవాలని స్పష్టం చేసింది. రవాణా శాఖ నోటిఫై చేసిన కంపెనీలు సరఫరా చేసే రిఫ్లెక్టివ్ టేప్‌లు మాత్రమే వాహనాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అదే టేప్ ఆకారాన్ని పోలేలా బయట మార్కెట్లో అతికించుకుంటామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు.
అయితే నాణ్యత దృష్ట్యా రవాణా శాఖ సూచించిన టేప్‌లను మాత్రమే వినియోగించాలని అధికారులు చెబుతున్నారు. టేప్‌లపై రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్ ఉంటుందని, వాహణ వివరాలన్నీ అందులో ఉంటాయని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలను సంపద్రించి స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఫిట్నెస్ పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారులపై విరివిగా సంభవిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు నిబంధనలపై అవగాహన లేకపోవడం తదితర కారణాలెన్నో వాహనదారుల ప్రాణాలను హరిస్తున్నాయి. అయితే చాలా వరకు రాత్రుల్లో ప్రయాణం చేసే సమయంలో ముందర ఉన్న వాహనాలు సమీపానికి వెళితే గానీ వాహనాలు ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో యాక్సిడెంట్స్ అధికంగా నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే వాహనానికి ధగధగమెరిసే రిఫ్లెక్టివ్ టేప్‌లు అతికించడం కీలకంగా మారింది. కాగా, టేపుల ధరలు అధికంగా ఉన్నాయని కొందరు వాహణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ధరలను తగ్గించాలని కోరుతున్నారు. హై విజిబిలిటీ ఉన్న 20 ఎంఏ(ఒక మీటర్‌కు)రిఫ్లెక్టివ్ టేప్ ధర రూ. 79 నుంచి 85 వరకు ఉంది. 50 ఎంఎం(ఒక మీటర్‌కు) టేప్ ధర రూ. 145 నుంచి 155 వరకు ఉంది. సీ3 (ఒక జత రూ.2500 నుంచి 2700 వరకు ఉంది. సీ4(జత)కు రూ.2900 ఉంది. విడిగా ఒక 40 ఎంఎం రిఫ్లెక్టర్ ధర రూ.35, 80ఎంఎం రిఫ్లెక్టర్ ధర రూ.60గా ఉన్నాయి. కాగా, వాహనం మొత్తానికి టేపుల ప్రక్రియ పూర్తిచేయాలంటే వేలల్లో మార్మోగుతుందని వాపోతున్నారు. కానీ నాణ్యత దృష్ట్యా ఆ క్వాలిటీ టేప్ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.