పెద్దపల్లి రూరల్, జూన్ 2 : మండలంలోని పెద్దకల్వల క్రాసింగ్ వద్ద నిమ్మనపల్లి గ్రామస్తులు మంగళవారం మట్టి టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు. సర్పంచ్ వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఎండలోనే బైఠాయించారు. తలలకు రుమాళ్లు కట్టుకొని, మంచినీళ్లు తెచ్చుకొని మరీ ఆందోళన చేశారు.
రాస్తారోకోతో నిమ్మనపల్లి నుంచి పెద్దపల్లి, జూలపల్లి మార్గంలో రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించడంతో పెద్దపల్లి రూరల్ ఎస్ఐలు మల్లేశ్, శ్వేత తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా రోడ్డుపైనే మ్యాట్ వేసుకొని బైఠాయించారు. మట్టి టిప్పర్లతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా..? అంటూ ఆగ్రహించారు. టిప్పర్లు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని భగ్గుమన్నారు.