నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 2: ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాళ్ల మీద పడి వేడుకున్నా అధికారులు కనికరించడం లేదని మండిపడుతున్నారు. మంగళవారం కూడా పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం చోటుచేసుకున్నది. రైతు ఏర్పుల మల్లేశం తన రెండెకరాల భూమితోపాటు కౌలుకు పది ఎకరాలు తీసుకొని వరి సాగుచేశాడు. గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలుకేంద్రానికి నెలరోజులక్రితం ధాన్యం తీసుకువచ్చినా కొనకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. నిర్వాహకులను బతిమాలినా కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికిగురైన మల్లేశం తనవెంట తెచ్చుకున్న డీజిల్‌ను ధాన్యంపైపోసి ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పక్కనే ఉన్న రైతులు అడ్డుకుని వెంటనే నీళ్లు చల్లారు.
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంబాల గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం పోసి రెండు నెలలవుతు న్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందని, వాన కాలం పంట కొరకు రైతులు ఎప్పుడు సిద్ధం కావాలని ప్రశ్నించారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందంటూ మహిళా రైతులు శాపనార్థాలు పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ వీరి నిరసనను పట్టించుకోకపోవడంతో వారంతా ఆయన చాంబర్లోకి దూసుకెళ్లారు.
తమ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారని నిలదీశారు. తాసీల్దార్ హరికృష్ణతోపాటు అక్కడికి వచ్చిన ఎస్సై శోభన్‌బాబు కాళ్లు మొక్కేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా బక్రిచెప్యాల క్రాసింగ్ వద్ద హైదరాబాద్ హైవేపై రైతులు ధర్నాకు దిగారు. నెల రోజులైనా ధా న్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి చేరుకోగానే ‘మా వడ్లు త్వరగా కొనుగోలు చేయండి సారూ’ అని కాళ్లు మొక్కుతూ వేడుకున్నారు. అర్బన్ తహసీల్దార్ హామీ మేరకు ఆందోళన విరమించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద జొన్న టోకెన్ల కోసం రైతులు బారులుతీరారు. మంగళవారం ఉదయం దాదాపు 500 మందికిపైగా రైతులు టోకెన్ల కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. నిలబడే ఓపిక లేక పాదరక్షలను క్యూలో పెట్టి నిరీక్షించారు.