కలెక్టరేట్, నవంబర్ 11 : కార్యాలయ పనివేళల అనంతరం కూడా అదనపు పను లు అప్పగిస్తూ, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు మేరకు జిల్లా సంక్షేమాధికారిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీలక్ష్మి మంగళవారం విచారణ చేపట్టారు. నగరంలోని అర్బన్ ఐసీడీఎస్ కా ర్యాలయంలో నిర్వహించిన విచారణకు జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో వి ధులు నిర్వహిస్తున్న సీడీపీవోలు, సూపర్వైజర్లు, మినిస్టీరియల్ సిబ్బంది హాజరుకాగా, వారందరినీ వ్యక్తిగతంగా విచారించా రు. సాధారణ కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులు, ఇతర సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుతో పాటు కందిపప్పు, కోడిగుడ్ల సరఫరాలో కూడా జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరైన వారిలో పలువురిని వివరాలు అడిగి నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
బేటీ బచావో.. బేటీ పడావో కా ర్యక్రమం నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్లు సంబంధిత ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెండోరోజు కూడా విచారణ కొనసాగనుండగా ఐసీడీఎస్‌కు అనుబంధంగా ఉన్న డిహబ్, ఐసీపీఎస్, సఖీ, చిల్డ్రన్ హోం సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందిని విచారించనున్నట్లు విచారణాధికారిగా వచ్చిన ప్రాంతీ య సంయుక్త సంచాలకురాలు ఝాన్సీలక్ష్మి తెలిపారు. కాగా, తోటి ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది పట్ల తానెప్పుడు దురుసుగా వ్యవహరించలేదని, విధుల నిర్వహణ పట్ల అప్రమత్తం చేయడమే తప్ప, ఇతరత్రా ఎలాంటి కార్యక్రమాలు పురమాయించలేదని, తనపై చేసిన అవినీతి ఆరోపణలన్నీ సత్యదూరమని జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి స్పష్టం చేశారు.