Rickshaw workers | కోల్ సిటీ , ఏప్రిల్ 18: రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న రిక్షా కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ నుంచి జీతాలు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి కలెక్టర్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ర్యాగ్ పిక్కర్స్ కార్మికులుగా 101 రిక్షాలకు చెందిన 202 మంది కార్మికులు 2002 నుంచి పని చేస్తున్నారని, చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే వీరు ఇంటింటి నుంచి ఆతిథ్యం తీసుకుంటూ మున్సిపాలిటీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పై అతి తక్కువ జీతాలతో కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడమే గగనంగా మారిందని, వారికి రక్షణ పరికరాలు కూడా ఇవ్వకపోగా అనారోగ్యాల బారిన పడితే పట్టించుకునే దిక్కు లేదని వాపోయారు. కార్పొరేషన్ అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని, అసలు రిక్షా కార్మికులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ర్యాగ్ పిక్చర్ కార్మికుల నుంచి 70 మంది కార్మికులను సీనియారిటీ ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకున్నారనీ, మిగతా 130 మందిని కూడా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా వర్తింపచేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు గౌస్ తోపాటు రిక్షా కార్మికులు పాల్గొన్నారు.