Singareni | రామగిరి, జూన్ 6: 2024-25 సంవత్సరానికి గాను రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-1 ఉపరితల గని సింగరేణి సంస్థలో ఉత్తమ పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) గని పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని కొత్తగూడెంలోని కార్పోరేట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలలో డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్ అండ్ పా) కొప్పుల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా గని తరఫున ఓసిపి-1ప్రాజెక్టు పర్యావరణ అధికారి కె.కిషన్ అందుకున్నారు.
జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇట్టి పురస్కారాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, ఏరియా పర్యావరణ అధికారి పీ రాజారెడ్డి, కే కిషన్ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావుకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జి.యం. మాట్లాడుతూ ఒసిపి-1 ఉత్తమ పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) గని పురస్కారం సాధించినందుకు అధికారులకు, ఉద్యోగులకు, కార్మిక సంఘాల నాయకులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఈ పురస్కారం సాధించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎ ఇంచార్జ్ ఎస్వోటుజియం బీవీ సత్యనారాయణ, మేనేజర్ రమేష్, అధికారి కోల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.