కరీంనగర్ కార్పొరేషన్, జూలై 4: అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కరీంనగర్ బల్దియా డీబీ (డ్రాయింగ్ బ్రాంచ్) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా?, ఒకే రకమైన పనికి టెండర్లు పిలిచినప్పుడు.. ఒకే రకమైన నిబంధనలు కాకుండా తమకు నచ్చినట్టు మార్చుతున్నారా..? సుడాకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి నూతనంగా పిలిచిన టెండర్ల ప్రక్రియలో అదే జరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కేవలం తమ అనుయాయులకు అనుకూలంగా ఉండే విధంగా టెండర్ రూల్స్ రూపొందించారన్న ఆరోపణలు వ్యక్తమవుతుండడం, ఈ విషయమై మాజీ మేయర్ రవీందర్‌సింగ్ నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేయడమే నిదర్శనంగా నిలుస్తున్నది. కాగా, గతంలో డీబీ సెక్షన్ తీరుపై విమర్శల నేపథ్యంలో నగర కమిషనర్ స్పందించి అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని తెలుస్తున్నది.
సుడా ఆధ్వర్యంలో నగరంలోని వన్‌టౌన్ ఠాణా సమీపంలో చేపడుతున్న సుడా కార్యాలయం, కమర్షియల్ కాంప్లెక్స్ పనుల కోసం ఇటీవల బల్దియా నుంచి రూ.2 కోట్లతో టెండర్లు పిలిచారు. కాగా, ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి రెండేళ్ల కిత్రం రూ.2 కోట్ల వ్యయంతో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు, రెండో అంతస్తుకు సంబంధించి పిల్లర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అయితే, అందులో ఈ వర్క్‌కు సంబంధించి గతంలో ఈ పనులు చేసిన అనుభవం ఉండాలని అప్పటి నిబంధనల్లో చేర్చారు. కాగా, ఇప్పుడు రూ.2 కోట్ల వ్యయంతో రెండో అంతస్తు, మూడు, నాలుగో అంతస్తు స్లాబ్ నిర్మాణానికి టెండర్ చేపట్టారు.
అయితే, ఇందులో పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను తొలగించారు. అయితే ఈ రూల్ మార్చడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్ శనివారం నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌కి ఫిర్యాదు చేశారు. పని ఒకే తీరు అయినప్పుడు ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, రూ.10 కోట్ల విలువ దాటిన టెండర్లలోనే పని చేసే అనుభవం నిబంధన ఉంటుందని, ఈ పనికి నిబంధన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ మొదటిసారి టెండర్లలో ఒకలా, రెండోసారి మరోలా నిబంధనలు మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతుండగా ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారన్న ఆసక్తి నెలకొన్నది.
నగరంలోని సుడా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలి. కమర్షియల్ కాంప్లెక్స్ కోసం మొదటిసారి నిర్వహించిన టెండర్లో పని స్వరూపం, అంచనా వ్యయం ఒకే తీరులో ఉన్నా టెండర్ నిబంధనలు మాత్రమే మారాయి. నిబంధనలు ఎవరి కోసం మార్చారో చెప్పాలి. కేవలం కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండాలనే ఇలా వ్యవహరించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.
– మాజీ మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్ సింగ్