MRPS | పెద్దపల్లి టౌన్, సెప్టెంబర్ 8 : సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇతర రుగ్మతలు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, సీపీఐ, ఏఐటీయూసీ ఇతర ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు గాని హామీలు ఇచ్చి నేటికీ వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, నరేష్, నారాయణరెడ్డి, మైసయ్య, కడారి సునీల్, పల్లె బాబు, జోగు రాజయ్య, శ్రీనివాస్ తోపాటు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.