Pandavula Gutta | ధర్మారం, జూలై 16 : వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై గురువారం గ్రామస్తులు వరద పాశం పోశారు. ఈ గుట్టను పాండవులు కొలువు తీరిన గుట్టగా గ్రామస్తులు భావిస్తూ ఉంటారు. ఈ గుట్ట మీద పాండవుల మహిమతో పెద్ద బండరాయి చీల్చుకొని ఏర్పడిన దొనలో మండు వేసవిలో కూడా నీరు సమృద్ధిగా ఉంటుంది. దీంతో అట్టి పవిత్రమైన దొన ప్రాంతంలో గుట్ట ఎక్కి గ్రామస్తులు సందర్శించారు.
దీంతో వారు అట్టిగుట్టపై పంచ పాండవుల ప్రతిమలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు పెట్టి వరద పాశం పోశారు. కరువు లేకుండా సమృద్ధిగా వానలు కురవాలని పంటలు బాగా పండాలని కోరుతూ వారు మొక్కులు సమర్పించారు. అనంతరం పరుపు బండపై పోసిన వరద పాశంను గ్రామస్తులు కతికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు,వార్డు సభ్యులు తీగుళ్ల రవళి కిరణ్,ఫీల్డ్ అసిస్టెంట్ సుందరగిరి చందు, గ్రామ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.