Ration dealers | పెద్దపల్లి, ఆగస్టు25: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కమీషన్ డబ్బులు చెల్లించాలని, నెలకు గౌరవ వేతనం రూ. 5వేలు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల నర్సయ్య, పెద్దపల్లి మండల అధ్యక్షుడు ఎలబోతారం శంకర్ మాట్లాడారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 మాసాల కమీషన్ డబ్బులు రాకా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్ కమీషన్ డబ్బులు రాకుంటే రాబోవు వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోలేని దుర్బర పరిస్థితి నెలకొందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మానిఫెస్టోలో పెట్టిన రూ. 5వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు కమీషన్ రూ.300 పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వచ్చే నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు రేషన్ షాపులు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.
ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
తెల్ల కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వటమే మంచిదే కానీ, గత 5 నెలలుగా రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని వాపస్ తీసుకోకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలో 413 రేషన్ ఉన్నాయని ఒక్కో షాపులో కనీసం 15 -20 క్వింటాళ్ల దాకా దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. దొడ్డు బియ్యం ముక్కి పోయి తెల్ల పురుగు వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే దొడ్డు బియ్యం వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు సంఘం నాయకులు తిరుమల్ గౌడ్, వెనగంటి దామోదర్‌రావు, లింగమూర్తి, దారవేణ ఓదెలు, హన్మంత్‌రెడ్డి, రాయలింగు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.