మానకొండూర్, మార్చి 9: ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటలు పండించిన రైతులు.. నేడు రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నరు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక, పెట్టుబడి సాయం అందక, సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు’ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మండిపడ్డారు. అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు ఇక కాలం చెల్లిందంటూ ధ్వజమెత్తారు. మానకొండూర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి మాట్లాడారు. రేవంత్ సర్కార్ పాలనతో ప్రజలు విసిగి పోయారని చెప్పారు.
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం చేతగాక ఎలక్ట్రిక్ బస్సుల పేరిట సంస్థను ప్రైవేట్‌పరం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా సంఘాల వద్ద ఉన్న డబ్బులు వాడుకోవడానికే ఆ సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నాడని ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేయడం ఏమో గానీ.. కూటికి లేని వారిగా మాత్రం చేయవద్దని సూచించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మేనిఫెస్టోలో మహిళలకు ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఒంటెత్తు పోకడ ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మరో ఆరు నెలలు గడువు పొడిగిస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు. కానీ, నియోజకవర్గంలో 12సొసైటీలు ఉంటే అందులో ఏడు సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిలను నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీవోను పట్టించుకోకుండా అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ కవ్వంపల్లి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కమీషన్ల కోసం సొసైటీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవుపలికారు. సొసైటీ చైర్మన్లను వేధిస్తున్న కవ్వంపల్లిపై త్వరలో వ్యవసాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజక కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, దండబోయిన శేఖర్, నెల్లి శంకర్, గట్టయ్య, కముటం సంపత్, కొట్టె రఘు, తదితరులు పాల్గొన్నారు.