తిమ్మాపూర్, జూలై 3 : ఆవిష్కరించిన అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు అధికార మదంతో మళ్లీ ముసుగు వేయించిన చరిత్ర హీనుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఘాటుగా విమర్శించారు. నీవు విగ్రహాలకు ముసుగేస్తే.. ప్రజలు నీకు ముసుగు వేస్తారని హెచ్చరించారు. అంబేద్కర్‌తో ఆటలు వద్దని హితవు పలికారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళిత సంఘాల నాయకులు కోరిక మేరకు తిమ్మాపూర్ బస్టాండ్ ప్రాంగణంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆవిష్కరణ ఆలస్యమైందని, అంతలోనే కోడ్ రావడంతో ఆగిపోయిందని చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా అన్నివర్గాలను కలుపుకొని అద్భుతంగా విగ్రహావిష్కరణ చేద్దామనుకున్నామని తెలిపారు. అయితే కవ్వంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లయినా ఆవిష్కరించకపోవడంతో తాము కలిసి అనుమతులు ఇవ్వాలని కోరామని, వెంటనే ఎమ్మెల్యే తేరుకొని పర్మిషన్ తెచ్చానంటూ సన్మానం చేయించుకున్నాడని గుర్తు చేశారు.
ఇది జరిగి మూడు, నాలుగు నెలలు అవుతున్నా విగ్రహాలు అలాగే ఉండడంతో తాను దళిత సంఘ నాయకులతో కలిసి గురువారం ఆవిష్కరించానని చెప్పారు. వెంటనే అధికారులను, బలగాలను పంపించి మళ్లీ ముసుగులు వేయించారని, పనులు నిలిపివేయించారని మండిపడ్డారు. ఆవిష్కరణ విగ్రహాలకు ఎక్కడైనా ముసుగులు వేస్తారా..? అని ప్రశ్నించారు. ముసుగులు వేయించిన నీకు ప్రజలు ముసుగులు వేసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.