మానకొండూర్, జూన్ 24 : ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులకు మొండిచేయి చూపుతున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. పార్టీ కార్యకర్తలు, భూములు, ఇండ్లు ఉన్న వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని, నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇండ్లు రాని నిజమైన నిరుపేదలకు బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని, వాళ్లకు ఇండ్లు కేటాయించే దాకా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈనెల 26న నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్‌లో మహాధర్నా చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు రాని అర్హులైన నిరుపేదలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతలు, సంక్షేమ పథకాలతో రైతులను రాజును చేస్తే, ఇప్పుడు రేవంత్ రైతుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహించారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగిందని, రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు అందాయని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 7500 రైతు భరోసా చెల్లించాలని, రైతుబీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అమాయక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆయన జిమ్మిక్కులను ప్రజలు నమ్మేస్థితిలో లేరని విమర్శించారు. కమిటీల పేరిట ఆ పార్టీ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మానకొండూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తున్న 48వేల మంది గుర్తించి గ్రామసభలలో ఎంపిక చేశారని, కానీ, ఇప్పుడు కేవలం 3200 మందికే ఇస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఎంపిక చేసిన వారిలో ఎంతమంది నిరుపేదలు, అర్హులు ఉన్నారో.. గ్రామసభల ద్వారా ప్రకటించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ నాయకులకు ఉన్నదా..? అని ప్రశ్నించారు. మానకొండూర్ దళిత నియోజకవర్గమని, అలాంటిది ఇల్లంతకుంట మండలం గుండారంలో ఒక్క ఎస్సీ కుటంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదంటే ఏస్థాయిలో అక్రమాలు జరిగాయో ప్రజలు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సిరిసిల్ల మాజీ జడ్పీవైస్ చైర్మన్ సిద్ధం వేణు, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, శాతరాజు యాదగిరి, గూడూరి సురేశ్, దండబోయిన శేఖర్, పిట్టల మధు, ఉండింటి శ్యాంసన్, కోండ్ర వెంకటస్వామి, బొల్లం అనిల్, పిండి సందీప్ తదితరులు పాల్గొన్నారు.