Ramulagutta | కోనరావుపేట, ఏప్రిల్ 13: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న బ్రహోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన రథోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. ఆదివారం చైత్ర పౌర్ణమి సందర్భంగా రథోత్సవం నిర్వహించగా రాములగుట్ట భక్తజనంతో పులకించిపోయింది. భక్తుల జేజేలు, జయజయ ధ్వానాల మధ్య రామనామస్మరణ మార్మోగింది.
యాజ్ఞచార్యులు మరిగంటి రామగోపాలచార్యులు, అర్చకులు కృష్ణ, లక్ష్మణ్ వేకువజామునే స్వామివారిని మేల్కోల్పి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అలకంరించారు. అనంతరం సుందరాంగుడు రామయ్యను, ముగ్ధ మోహనురాలు సీతమ్మను పల్లకీలో తీసుకువెళ్లి రంగురంగుల పూలతో ముస్తాబు చేసిన రథంపై ఆశీనులు చేశారు. వివిధ గ్రామాల నుండి అశేషంగా తరలివచ్చిన భక్త జనవహిని రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకొని అనాధిగా వస్తున్న ఆచారంలో భాగంగా రూపాయి పెట్టి స్వామివారికి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ప్రధాన ఆలయం నుంచి గుంటి హనుమాన్ దేవాలయం వరకు రథాన్ని లాగుతూ డీజే పాటలు, యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, శ్రీరామంజనేయ దీక్షాపరుల భజనల సంకీర్తనలతో తరలివెళ్లి అత్యంత వైభవోపేతంగా అపురూప రథోత్స ఘట్టాన్ని నిర్వహించారు. సాయంత్రం వేళలో పుష్పయాగం నిర్వహించి ఉత్సమూర్తులను రాములగుట్టపైకి తీసుకువెళ్లి ఏకాంత సేవతో బ్రహోత్సవాలను ముగించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇన్చార్జీ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, శ్రీరామంజనేయ దీక్షాపరులు, భక్తులు పాల్గొన్నారు.