నేతన్న చౌరస్తా, డిసెంబర్29: సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ కవయిత్రి బూర రాజేశ్వరికి కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం మధ్యాహ్నం మండెపల్లి కేసీఆర్ కాలనీలోని తన డబుల్బెడ్రూం ఇంటిలో ఆమె అనారోగ్యంతో మృతిచెందగా, గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు, కవులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.
సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడ జిందం చక్రపాణి నివాళులర్పించి, దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. రాజేశ్వరి భౌతికంగా దూరమైనా ఆమె రాసిన కవితల రూపంలో ఎప్పుడూ మనలో చైతన్యాన్ని కలిగిస్తూ మనతోపాటే ఉంటారన్నారు. అంగవైకల్యంతో బాధపడకుండా తన కాళ్లనే చేతులుగా మార్చుకుని ఎన్నో అద్భుత రచనలు చేసి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపిన కవయిత్రి బూర రాజేశ్వరి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమైనదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు బూర రాజేశ్వరి అంత్యక్రియలను సొంత ఖర్చులతో జరిపించినట్లు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు.