చందుర్తి, సెప్టెంబర్ 06: ఆచార్యదేవోభవ అనే నానుడికి సార్థకతను చేకూరుస్తున్నారు ఈ ఉపాధ్యాయ దంపతులు. బోధనలో వైవిధ్యం, విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు వీరు తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. బోధనలతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాపిల్ల నరేష్, యాస శ్రీలత టీచర్స్ డే సందర్భంగా అవార్డు అందుకున్నారు. వేర్వేరు పాఠశాలల్లో పనిచేసే ఈ దంపతులు ఒకేసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం విశేషం.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారీ టీచర్ కపుల్. నరేష్ చందుర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా, శ్రీలత మూడపల్లి ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి శ్రీలత కృషి చేశారు. గతేడాది మాడపల్లి ఎంపీపీఎస్‌లో పిల్లల సంఖ్య 28 ఉండగా, ఈ విద్యా సంవత్సరానికి 51కు పెంచారామె.
ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ టెక్నాలజీతో నరేష్ విద్యార్థులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా పాటలను బోధిస్తారు. నిరుడు ఆయన తయారు చేసిన ‘టీఎల్ఎం పోగ్రామ్’ దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌లో ద్వితీయ స్థానంలో నిలచింది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన వీరు తమ కుమార్తె సహస్రన్వితను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఈ దంపతులను మండల విద్యాధికారి టీ.వినయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.