ఎల్లారెడ్డిపేట, మే 27 : రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని దుర్వేషావలి దర్గా గుట్టపై సందర్శకుల కోసం వేసిన షెడ్డును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమంగా షెడ్డును నిర్మించారని వచ్చిన ఫిర్యాదుతో మంగళవారం కూల్చివేశారు.
స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల దుర్వేషావలి దర్గా గుట్టపై ఉరుసు ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఏటా గ్రామస్తులు అంతా కలిసి ఉత్సవంలో కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. దీంతో పాటు మండలంలోని పలు గ్రామాల నుంచి గుట్ట మైదానంలో కందూరు చేసుకోవడంతో పాటు పలు విందు వేడుకలు జరుపుతారు. దీంతో అక్కడికి వచ్చే సందర్శకుల కారణంగా చిరు వ్యాపారులు సైతం ఆర్థిక వెసులుబాటుగా భావిస్తుంటారు. అయితే ఇటీవల ఉరుసు ఉత్సవాలు జరిగిన సమయంలో గుట్టపై ఏర్పాటు చేసిన షెడ్డును అక్రమంగా నిర్మించారని పలువురు బీజేపీ నాయకులు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు షెడ్డును కూల్చివేశారు.
ఉదయం లేవగానే విషయం తెలుసుకున్న గ్రామస్తులు షెడ్డు కూల్చివేత ఘటనపై ఆవేదన చెందారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు సింగారం దర్గా వద్ద ప్రెస్ మీట్ ఉందని ప్రకటన చేశారు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు ఊరి పొలిమేర వద్ద బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు గుమిగూడారు. రెండు కార్లలో అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులను అడ్డుకోగానే పరిస్థితిని గమనించిన వారు అక్కడనుంచి పారిపోయారు. అయితే కారులో స్థలం లేకపోవడంతో ఒక వ్యక్తి మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న గ్రామస్థులు అతనిపై దాడి చేసేందుకు వెళ్లారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు అతన్ని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తప్పించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మరికొంత మంది బీజేపీ నాయకులు సింగారం వెళ్లే ప్రయత్నం చేయగా నారాయణపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీసు వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సింగారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, డీఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోలీస్ స్టేషన్ బయట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గుట్ట సమీపంలో కబ్జా అయిన భూమిని గుర్తించాలని అధికారులను కోరారు.
Singaram2