ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 28: మూడురోజులుగా రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎల్లారెడ్డిపేట (Yellareddypet) మండలం సింగారం గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరికి నిరసగా ధర్నాకు దిగారు. సన్నధాన్యం కొనుగోలు చేస్తామని, దీనికోసం రైస్ మిల్లులను కేటాయించామని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మూడు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం దించుకోవడానికి మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారని మండిపడుతున్నారు.
సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో సింగారంలో రైతులంతా ధాన్యం పండించి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. గత 20 రోజుల క్రితం వరి ధాన్యం కల్లాల్లోకి తెచ్చి కొనుగోలు కోసం ఎదురు చూశారు. రైతులకు మొర పెట్టుకోగా నాలుగు రోజుల క్రితం కాంటా చేసిన వడ్లను పరిరలోని శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీస్‌కు కేటాయించగా ఒక లారీ ధాన్యం లోడ్ చేసి పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తాము సన్నపు ధాన్యం తీసుకోవడం లేదని చేతులెత్తేయడంతో నాలుగు రోజులపాటు వేచి చూసి సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు 50 మంది రైతులు పలు పార్టీలకు సంబంధించిన నాయకులు సన్నపు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న డీసీఎస్ఓ వసంతలక్ష్మి సన్న వడ్లను కచ్చితంగా కొనుగోలు చేసేలా, రైస్ మిల్లులో దింపుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ధర్నా విరమించారు.