వేములవాడ అర్బన్ : కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తే తాము ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు. వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి బ్రిడ్జిపై కేసీఆర్ చిత్రపటంతో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం మిడ్ మానేరు జలాశయంలోని కాళేశ్వరం నీటితో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు. రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ప్రాజెక్టులో లోపాలు ఉంటే మరమ్మతులు చేయాలి కానీ రాజకీయ లబ్ధి కోసం దానిని వాడుకోవడం పద్ధతి కాదని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పావని గౌడ్, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీ రావుతోపాటు పెద్దఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.