సిరిసిల్ల రూరల్, మార్చి 11: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెంట్ గంగారాం (Gangaram) మృతి చెందారు. సోమవారం రాత్రి తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం.. లిఫ్ట్ పై పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డీఎస్పీ నివాసానికి గంగారాం వెళ్లారు. అయితే రాత్రి వేళలో వెలుతురు సరిగా లేకపోవడం, లిఫ్టు రాకపోయినా గేటు తెరచుకోవడంతో మూడో అంతస్తులో ఉన్న ఆయన దానిపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను డీఎస్పీతోపాటు పోలీసు సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతిచెందారని వైద్యులు తెలిపారు. కాగా, గంగారావు మృతితో పోలీస్ బెటాలియన్లో విషాదం నెలకొన్నది. మంగళవారం ఉదయం సిరిసిల్ల దవాఖానకు పోలీస్ బెటాలియన్ సిబ్బంది అధికారులు చేరుకొని గంగారం మృతదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.