పావలవడ్డీ రుణాల సద్వినియోగం
ఆర్థికంగా పురోగతి సాధిస్తున్న మహిళా సంఘాలు
నెలనెలా క్రమం తప్పకుండా కిస్తీల చెల్లింపులు
వ్యాపారాల్లో రాణిస్తున్న సమైక్య మహిళలు
సారంగాపూర్, అక్టోబర్ 7: స్వరాష్ట్రంలో స్వశక్తి మహిళా సంఘాలు ప్రగతి పథంలో సాగుతున్నాయి. సర్కారు పావులా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నాయి. పొదుపు మంత్రాన్ని పఠిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయి. చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ నెలనెలా కిస్తీలు కడుతూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.
స్వరాష్ట్రంలో సమైక్య సంఘాలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. సర్కారు ఇస్తున్న పావలావడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాయి. నెలనెలా చెల్లింపులు చేస్తూ ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో 15,049 స్వశక్తి సంఘాలు ఉండగా 1,77,373 మంది సభ్యు లు, 564 గ్రామైక్య, 18 మండల ఐక్య సంఘాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,786 స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యం రూ.446.74 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు 4779 సంఘాలకు రూ.225.26 కోట్లు మంజూరు చేశారు. సాధ్యమైంత త్వరలో నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చిరు వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి..
ప్రభుత్వం అందించిన పావలావడ్డీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. చిరువ్యాపారాలు చేస్తూ దినదినం ఆర్థికస్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కిరాణా జనరల్ స్టోర్, మెకానిక్, కుల వృత్తులు, లేడిస్ ఎంపోరియం, సూపర్‌మార్కెట్, టెంట్ హౌస్‌లు, కోళ్లఫారం, పాడి గేదెల పెంపకం, బ్రిక్స్ ఇటుకల తయారీ, వాటర్ ఫ్లాంట్, హర్డ్‌వేర్, ఇస్తార్ల తయారీ, పిండిగిర్ని ఇలా స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని విజయవంతంగా ముందుకుసాగుతున్నారు. అలాగే గతేడాది ప్రభుత్వం మహిళ గ్రామ సమాఖ్యల ద్వారా ఎంపిక చేయబడిన జిల్లాలు, మండలాల్లో ప్రయోగత్మకంగా మామిడి కొనుగోళ్లు కూడా ప్రారంభించారు. సారంగాపూర్ మండలంలో 547 మహిళా స్వశక్తి సంఘాలు ఉండగా ఇందులో 6,554 మంది సభ్యులు ఉన్నారు. మండలంలో 18 గ్రామైక్య సంఘాలు, ఒక మండల సమాఖ్యలు ఉన్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో మహిళ సంఘాల సభ్యులకు వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు అవగాహన కల్పించి బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు అందించడంతో మహిళలు వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు..
మహిళ సంఘాల సభ్యులు వారికి ఆసక్తి ఉన్న స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారు. సంఘాల సభ్యులు ఆదాయాభివృద్దికి బ్యాంక్ లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంతో చెల్లిస్తున్నారు. మండలంలో 2021-22 ఆర్థిక సంవత్సరం స్వశక్తి సంఘాలకు బ్యాంక్ లింకేజీ టార్గెట్ రూ.20 కోట్ల17లక్షల21వేలు ఉండగా ఇప్పటివరకు రూ.9 కోట్ల45 లక్షల రుణాలు బ్యాంక్ లింకేజీ ద్వారా ఇచ్చాం. రుణాలు తీసుకున్న మహిళలు వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.