రైతు బీమా తరహాలో 5లక్షల బీమాకు నిర్ణయం
తాజాగా సిరిసిల్ల జిల్లా వేదికగా ప్రకటన
అప్పుడే రంగంలోకి జౌళిశాఖ
ఆనందంలో కార్మిక కుటుంబాలు
రాజన్న సిరిసిల్ల, జూలై 5 (నమస్తే తెలంగాణ): నేడు నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నిండినయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మంత్రి చొరవతో వస్త్ర పరిశ్రమే కాదు, కార్మికులకు మంచి రోజులు వచ్చినయ్. వస్ర్తాల ఆర్డర్లు.. రాయితీలు.. రుణాలు.. పథకాలు.. ప్రోత్సాహాలు ఆదుకున్నయ్. బతుకమ్మ చీరెలు, యూనిఫాంలు, ఇతర వస్ర్తాల తయారీ బతుకులను మారుస్తున్నయ్. చేతినిండా పని, పనికి తగ్గ పగారాతో ఇప్పుడిప్పుడే సంతోషాలు నిండుతున్నయ్. ఇలాంటి తరుణంలో సిరిసిల్ల వేదికగా సీఎం మరో ప్రకటన చేయడం కార్మికులకు మరింత ధీమానిస్తున్నది. ఇంటిపెద్ద చనిపోతే కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు రైతుల తరహాలో ‘చేనేత బీమా’ను అమలు చేస్తామని చెప్పడం భరోసానిస్తున్నది.
నాడు సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు నేడు టీఆర్ఎస్ సర్కారు పూర్వవైభవం తెస్తున్నది. స్వరాష్ట్రంలో ప్రత్యేక దృష్టి సారించి, ఏడేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలతో తిరిగి జీవం పోస్తున్నది. చితికిపోయిన నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బతుకమ్మ చీరలు, వస్ర్తోత్పత్తుల ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చింది. కేవలం బతుకమ్మనే కాదు రంజాన్, క్రిస్మస్, విద్యార్థుల యూనిఫాంల తయారీ కోసం 2500 కోట్ల ఆర్డర్లు ఇస్తున్నది. గతంలో నెలకు 10వేలు మాత్రమే సంపాదించిన కార్మికులు సర్కారు ఇచ్చిన వస్త్ర ఆర్డర్లతో నేడు 15వేల నుంచి 20వేల దాకా సంపాదిస్తున్నారంటే సర్కారు తీసుకున్న చర్యలతోనే సాధ్యమైంది. చేతినిండా పని. పనికి తగ్గ కూలీ దొరికి నేతన్నల బతుకు చిత్రమే మారిపోయింది. ఇంకా నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులను తయారు చేసేలా టెక్స్టైల్స్ పార్కులో కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. చేనేత మగ్గాలపై తయారయ్యే పట్టు చీరలు మరమగ్గాలపై తయారవుతున్నాయంటే సర్కారు అందించిన చేయూత వల్లనే అని గర్వంగా చెప్పవచ్చు. ఇంకా నేత బజార్ కావాలంటూ వస్త్ర ఉత్పిత్తి దారులు అడిగిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మూడెకరాల పాత మార్కెట్ యార్డును నేతబజార్కు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కుటుంబాలకు భరోసా..
జోట ఆగితే పాణం పోయే నేతన్నలకు రిటర్మైంట్ అంటూ లేదు. కాటికి కాళ్లు చాపినా మరమచక్రం తిరిగితేనే బతుకు చిత్రం నడుస్తుంది. అలాంటి నేత కార్మికుల కుటుంబాలకు కర్షకుల మాదిరిగా బీమా సౌకర్యం కల్పించాలని ఆదివారం సిరిసిల్ల ప్రారంభోత్సవాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ విన్నవించారు. అడిగిన వెంటనే సీఎం స్పందించి, నేత కార్మికులను ఆదుకునేందుకు సిరిసిల్ల వేదికగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రైతుబీమా తరహాలో త్వరలోనే ‘చేనేత బీమా’ అమలుచేస్తామని ప్రకటించారు. రైతులు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షలు వచ్చేలా చేసినట్టే.. నేత కార్మికుడు చనిపోయినా.. అతడి కుటుంబం ఖాతాలోకి 5 లక్షలు పడుతాయని చెప్పారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి త్వరలోనే కార్పస్‌ఫండ్ ఏర్పాటుచేస్తామన్నారు. సీఎం చేసిన ప్రకటనతో నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. తమకు బీమాతో అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కార్మికులు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.