Guidelines missing contract works | కోల్ సిటీ, సెప్టెంబర్ 22: రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్’ తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో మార్గదర్శకాలకు తిలోదకాలు ఇస్తున్నారన్న అపవాదు ఉంది. కమిషన్లు తీసుకొని థర్డ్ పార్టీ సర్టిఫికెట్ ఇస్తోంది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు జారీ చేస్తోంది. ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్యాలయంకే పరిమితం అవుతుండగా, కాంట్రాక్టర్లదే ఫైనల్ అవుతోంది.
గత 2023లో మంజూరు చేసిన రూ.100 కోట్లతో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్రా అభివృద్ధి పనులను ఏఈలు గానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు గానీ ఒక్కరు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్కడి పనుల్లో నాణ్యతను పరిశీలించడం లేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా ఇటీవల రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులతో పలు డివిజన్లలో యూజీడీ పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల్లోనైనా క్వాలిటీ కంట్రోల్ పారదర్శకత పాటిస్తుందా? అన్న అంశం తెరపైకి వచ్చింది.
ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తోంది..?
కాగా, రామగుండం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగం నిద్రపోతుందా? అన్న విమర్శలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులతో పాటు 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, ఎస్ డి ఎఫ్, వివిధ పరిశ్రమల సీఎస్సార్ నిధులు, సబ్ ప్లాన్ గ్రాంట్ల అభివృద్ధి పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. కార్పొరేషన్ లో ఒక ఈఈ, ఐదుగులు డీఈలు, నలుగురు ఏఈలతోపాటు ఔట్ సోర్సింగ్‌లో వర్క్ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నారు. వీరిలో వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీ మీదనే భారం వేస్తున్నారు. సదరు ఏజెన్సీ మాత్రం పనులను పరిశీలించకుండానే కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు తీసుకవచ్చిన పైపులను ఎక్కడ కొనుగోలు చేశారో కూడా వాకబు చేయడం లేదు.
ఇక రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనుల్లో సిమెంట్ మిశ్రమంలో నాణ్యత ప్రమాణాలను అటు ఏజెన్సీ గానీ, ఇటు అధికారులు గానీ పరిశీలించడం లేదు. దీనితో అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో థర్డ్ పార్టీ క్షేత్ర స్థాయిలో వెళ్లి పనులను పరిశీలించాకే బిల్లుల చెల్లింపులు జరిగేది. ఇప్పుడు ఆ జాడే కనిపించడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు డివిజన్లలో జరుగుతున్న పనులను కంటితుడుపుగానే పరిశీలిస్తున్నారు.
ఆర్ అండ్ బీ నుంచి థర్డ్ పార్టీ క్వాలిటీ వారు పనులను స్వయంగా పరిశీలించి సిమెంట్ మిశ్రమంను పరీక్షల నిమిత్తం పంపించాల్సి ఉంటుంది. నాణ్యతను ధృవీకరించాకే సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరగబోయే యూజీడీ పనుల్లో ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.
‘క్వాలిటీ’ విషయంలో రాజీ ప్రసక్తే లేదు : జే. అరుణ శ్రీ, కమిషనర్
థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కు తోడు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో పరీక్షలు నిర్వహిస్తాం. నాణ్యత నిర్ధారించుకున్న తరువాతనే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లిస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఈ షరతులను ఈసారి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో కూడా పొందుపరిచాం. అభివృద్ధి పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. ఆర్ అండ్ బీ నుంచి నాణ్యత పరిశీలించేలా చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ విషయంలో రాజీ ప్రసక్తి లేదు. క్వాలిటీ కంట్రల్ పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటాం. నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ పైన చర్యలు తప్పవు.