ధర్మారం, నవంబర్ 22 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో ఆవుల సదయ్య అనే ఇంటిలో శనివారం సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరిగుడిసె దగ్ధమైంది. బాధితుడు సదయ్య, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిరుపేద అయిన సదయ్య గ్రామంలో పూరి గుడిసెలో నివాసముంటున్నాడు. సదయ్య గ్రామ శివారులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వాచ్ మెన్ గా పనిచేస్తూ ఉదయం అక్కడే ఉన్నాడు.

ఈ క్రమంలో ఉదయం సుమారు 11:30 గంటల సదయ్య భార్య మాధవి ఆమె కుమారుడు మణి రుద్రంశ్ (2) తో కలిసి పూరి గుడిసెలో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ గ్యాస్ నుంచి పైపు ఊడి బయటకు మంటలు లేచాయి . ప్రమాదాన్ని గమనించిన మాధవి తన కొడుకు తో అకస్మాత్తుగా గుడిసెలో నుంచి బయటికి రావడంతో తల్లి కొడుకుకు ప్రాణాపాయం తప్పినట్లయింది. గ్యాస్ లీక్ అయిన సంఘటన గురించి మాధవి గట్టిగా అరవడంతో హుటాహుటిన చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.
కాగా అప్పటికే గ్యాస్ లీక్ అయిన సమయంలో గుడిసెకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో గ్యాస్ స్టవ్ పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు వచ్చి నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సదయ్య ఇంటిలోని వంట సామాగ్రి, బియ్యం, బట్టలు కాలి పోయాయి. బాధితులు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సదయ్య అతడి భార్య మాధవి వేడుకుంటోంది.