దొంగతనాల్లో ఈ దొంగది సెపరేట్ స్టెల్! భార్యకు కూడా అనుమానం రాకుండా అతడు చేస్తున్న చోరీల గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే! చోరీలకు వెళ్లే ముందు రెక్కీ చేయడం, బీర్లు తాగి, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి పట్టపగలే ఇంటిని దోచేయడం, ఆపై ఆభరణాలను ఫైనాన్స్ సంస్థల్లో పెట్టడం ఆ చోరాగ్రేసరుడి అలవాటు! అలా వచ్చిన డబ్బులతో ఏకంగా సొంతిల్లు కట్టుకున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే!
ఫర్టిలైజర్‌సిటీ, మార్చి 9: పక్కా రెక్కీ నిర్వహిస్తాడు. పట్టపగలు ఒంటరిగా వెళ్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మూడు బీర్లు తాగి, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలోకి చొరబొడి దొరికినకాడికి దోచుకెళ్తాడు. కొన్నేండ్లుగా కోల్‌బెల్ట్ ఏరియాలో వరుస చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి నిందితుడి వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. నెల్లూర్‌కు చెందిన రాజవరపు వెంకటేశ్ కొన్నేండ్ల క్రితం బతుకు దెరువుకోసం మంచిర్యాల జిల్లా షిర్కేకాలనీకి వచ్చాడు. శ్రీరాంపూర్‌కు చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డాడు. మద్యం, వ్యసనాలకు బానిసయ్యాడు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడేవాడు. ఈ క్రమంలో చోరీలకు అలవాటు పడ్డాడు. దొంగతనం చేసిన ఆభరణాలను ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో మణుగూరులో ఇల్లు కట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో కోటి వరకు పెట్టాడు. సీసీ కెమెరాలు, జన సంచారం లేని చోట తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటాడు. చోరీ చేసే ముందు మూడు బీర్లు తాగి, సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేస్తాడు. భార్యకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఉపయోగించేవాడు. ఇంటి వెనుకాల తలుపులను తెరిచి లోనికి చొరబడతాడు. అందినకాడికి అపహరించుకొని పరారవుతాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో క్రిమినల్ డేటా బేస్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అప్పటి నుంచి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీసీసీ నస్పూర్ ఎస్ఐ రాయల్ టాకీస్ చౌరస్తాలో పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుబడ్డాడు. అతడి నుంచి నాలుగు ద్విచక్ర వాహనా లు, ఒక కారు, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు.
కోల్‌బెల్ట్ ప్రాంతంలోని పలు ఠాణాల్లో రాజవరపు వెంకటేశ్‌పై 72 కేసులు నమోదయ్యాయి. నస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏడు, లక్షెట్టిపేటలో ఆరు, చెన్నూరులో ఏడు, మందమర్రిలో 11, రామకృష్ణాపూర్లో 17, కాసిపేటలో 2, శ్రీరాంపూర్‌లో 1, మంచిర్యాలలో 5, గోదావరిఖని వన్‌టౌన్ పరిధిలో 14, భీమారంలో 2 చొప్పున వరుస దొంగతనాలకు పాల్పడి మొత్తం 72 కేసుల్లో చోరీ చేసిన సోత్తు 2.89 కిలోల బంగారు, 4.07 కిలోల వెండి ఆభరణాలు, నగదు 19 లక్షలతో మొత్తం కోటీ 20 లక్షల వరకు ఎత్తుకెళ్లినట్లు విచారణలో తేలింది. ఈ కేసు నేర పరిశోధనలో సహకరించి చాకచక్యంగా వ్యవహరించిన మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ రాంనాథ్, మంచిర్యాల ఏసీపీ బీ తిరుపతిరెడ్డి, రూరల్ సీఐ టీ సంజీవ్, బీ రవికుమార్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ టీ ఉదయ్‌కుమార్ సింగ్ ఎస్ఐ తిరుపతి, కానిస్టేబుళ్లు బీ శ్రీనివాస్, బీ రవిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.