కలెక్టరేట్, మే 16 : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తున్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంకతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 241 దరఖాస్తులు రాగా, వాటిని ఆయా విభాగాల అధికారులకు బదిలీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. 134 ఎస్సీ కార్పొరేషన్, 68 రెవెన్యూ, 9 పంచాయతీరాజ్, 9 మున్సిపల్, ఇతర శాఖలకు చెందిన 21 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యనిర్వహణాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీలతారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జువేరియా, జిల్లా సంక్షేమాధికారి వి.పద్మావతి, వివిధ శాఖల అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.