Minister Adluri Laxman Kumar | ధర్మారం, ఆగస్టు 25 : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. స్థానిక ప్రాథమిక ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ నూతన భవనం, స్థానిక వడ్డెర కాలనీ ఎదుట నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని కలెక్టర్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌర సరఫరాల శాఖ స్మార్ట్ కార్డులను కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మండలంలో ప్రభుత్వ భూముల సర్వే జరిపిస్తున్నామని ఇందులో భాగంగా బొమ్మరెడ్డిపల్లి శివారులోని 679 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా నర్సింగాపూర్ గ్రామంలో కూడా భూ అక్రమాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడమని అన్నారు. ఇంకా ఖిలావనపర్తి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. తమ ప్రభుత్వం ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బొమ్మ రెడ్డిపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ద్వారా ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఎర్రగుంటపల్లి శివారు నుంచి ధర్మారం శివారులోని జక్కన్న పల్లి వరకు ఆర్అండ్బీ రహదారిని 4 లైన్ల రహదారిగా విస్తరిస్తామని అందుకు టెండర్లు కూడా పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 70 గ్రామాలలో భూభారతి కార్యక్రమం కింద భూముల సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా ధర్మారం మండలంలోని 5 గ్రామాలను ఎంపిక చేయగా అందులో పైడి చింతలపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి భూముల సర్వే చేసినట్లు ఆయన వివరించారు. పట్టాదారుకు ఉన్న భూములు అన్నిటికీ భూధార్ నెంబరు కేటాయించడం వలన భూముల పరిరక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాగేటి రాజేశ్వరి, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, డీఎస్ఓ శ్రీనాథ్, తహసీల్దార్ డీ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలత, ధర్మారం పీహెచ్సీ డాక్టర్లు అనుదీప్, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.