Normal deliveries | కోరుట్ల, జూన్ 28: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మాతా, శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియాస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులను ఆయన పరిశీలించారు. గర్భిణీలు బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. పీహెచ్ సీల వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్ల పనితీరు గురించి తెలుసుకున్నారు. మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ సునీత రాణి, వైద్యురాలు విజయలక్ష్మి, సూపర్వైజర్ ధనుంజయ్, ఫార్మాసిస్ట్ ఉదయ్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.