Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 6 : నిన్నటి దాకా చెత్తాచెదారం, వర్షపునీటి గుంతలు, అడుగేస్తే బురదలోకి కూరుకుపోయిన కలెక్టరేట్ పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ తన కరీంనగర్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ శాఖల అధికారులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటరాక్ట్ కానుండటంతో, పరిసరాల్లో గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు.
50 మందికి పైగా మున్సిపల్ కార్మికులతో పరిసరాలు మొత్తం శుభ్రం చేయించటంతో పాటు ఇటీవల నాటిన ప్లాంటేషన్‌లో పెరిగిన గడ్డి తొలగించారు. కలెక్టరేట్లోని వివిధ కార్యాలయాలకు వెళ్ళే అంతర్గత రహదారిపై గత కొంతకాలంగా ఉన్న గుంతలు పూడ్చి వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో నీరు నిలిచి బురదగా మారిన ప్రాంతాల్లో డస్ట్ పోయించారు. కలెక్టర్ చాంబర్‌తో పాటు, ఆడిటోరియంలోకి వెళ్లేదారుల చుట్టూ ఫెన్సింగ్ వేయించి, రంగులతో అలంకరించారు. యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న పనులను చూస్తూ వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌లోకి వచ్చిపోయే వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్ళు మోకాలు లోతు నీటిలో నుంచి కార్యాలయాలకు వెళ్లినా తమ ఇబ్బందులను పట్టించుకోలేదని, రాష్ట్ర మొదటి వ్యక్తి వస్తుండడంతో ఆఘమేఘాల మీద పనులు జరిపిస్తున్నారని, గవర్నర్ విజిట్తోనైనా అంతర్గత రోడ్డుతో తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించిందనే వ్యాఖ్యలు విజిటర్ల నోటి నుంచి వెలువడటం గమనార్హం.
కాగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమం అధికారికంగా ఇప్పటివరకు ఖరారు కాలేదని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాతవాహన వర్శిటీ ఆవరణలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్న 2వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీలును బట్టి కలెక్టరేట్ కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.