లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు నాడి రాజకీయ పార్టీలకు అంతుపట్టడం లేదు. ఈ సారి పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం.. పట్టణ ప్రాంతాల్లో తగ్గడం ఊహకు అందడం లేదు. పలుచోట్ల అంచనాలకు మించి పోలింగ్ కావడం లెక్కలకు చిక్కడం లేదు. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న భిన్న సమాధానాలు ఆయా పార్టీల అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘తప్పకుండా మనమే గెలుస్తున్నా’మంటూ కొంత మంది ధీమా వ్యక్తం చేస్తున్నా.. అదే సమయంలో మరికొంత మంది ‘మన గెలుపు కష్టమే’నంటూ నివేదికలు ఇవ్వడం అంచనాలను తలకిందులు చేస్తున్నాయి.
పోలింగ్ మొదలైనప్పటి నుంచే వస్తున్న రిపోర్ట్‌లను అనుసరించి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడికలు తీసివేతల్లో బీజీబీజీగా గడుపుతున్నారు. జూన్ 4న భవితవ్యం తేలనుండగా ఉత్కంఠకు లోనవుతూ.. అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఎన్ని సార్లు లెక్కలు వేసినా.. భిన్న రకాలుగా వస్తున్న ఫలితాలను చూసి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత కల్పించారు.
కరీంనగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం అంచనాలను దాటింది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో ఓటింగ్ వినియోగించుకున్న తీరు గతంలో మాదిరిగానే ఉన్నా.. మండలాలు, గ్రామాల్లో మాత్రం హోరెత్తింది. నిజానికి ఎండలు దంచికొడుతున్న తరుణంలో పోలింగ్ తక్కువగానే నమోదవుతుందని అందరూ భావించారు. పోలింగ్‌కేంద్రాలకు పెద్దగా ఓటర్లు వచ్చే అవకాశముండదనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ముందు నుంచే అన్ని చోట్లా ఓటింగ్ పెంచేందుకు యంత్రాంగం భారీ కసరత్తే చేసింది.
దాని ఫలితంగానే పోలింగ్ పెరిగినట్టు తెలుస్తున్నది. కారణాలు ఏవైనా ఓటు వినియోగం పెరగడం మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. అయితే పట్టణ ఓటర్లు మాత్రం ఓటు వినియోగంపై అలసత్వమే చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అతిపెద్ద పట్టణ ప్రాంతమున్న అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్. ఈ సెగ్మెంట్లో మొత్తం 3,67,353 ఓటర్లకు గాను 2,22,296 మంది అంటే 60.51 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను చూస్తే ప్రతినియోజకవర్గంలోనూ 73 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పెద్దపల్లిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలైన మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాలను చూస్తే.. మంచిర్యాలలో 60.84 శాతం, రామగుండంలో 61.59 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఏ కోణంలో చూసినా పట్టణాల కన్నా.. పల్లెలే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమైంది.
నిజానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో.. ఒక్కో రకమైన పోలింగ్ ట్రెండ్ కొనసాగింది. అంతేకాదు, సదరు సెగ్మెంట్లోని మండలాల్లోనూ విభిన్న కోణాల్లో ఓటింగ్ జరిగింది. కొన్ని గ్రామాలు ఒక పార్టీకి ఆయువు పట్టుగా నిలిస్తే.. మరికొన్ని గ్రామాలు మరో పార్టీకి అండగా నిలిచాయి. ఒక్కోచోట రెండు పార్టీల మధ్య పోటాపోటీగా పోలింగ్ సాగింది. వీటితోపాటు మెజార్టీ గ్రామాల్లో సైలెంట్ ఓటింగ్ నడిచిందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి.
ఇదే సమయంలో పట్టణాల్లో కొన్ని పార్టీలకు పట్టుండగా.. పల్లెల్లో మరికొన్ని పార్టీలకు పట్టు ఉన్నది. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లో తగ్గిన ఓటింగ్ ఏ పార్టీపై ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. అలాగే, పల్లెల్లో పెరిగిన పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్నది పార్టీలకు అంతుచిక్కడం లేదు. క్షేత్రస్థాయి నుంచి మాత్రం భిన్నరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఒక్కో పార్టీకి సంబంధించి మూడు నాలుగురకాల అభిప్రాయాలు వస్తున్నట్లు ఆయా పార్టీల ప్రధాన నాయకులు చెబుతున్నారు.
‘కచ్చితంగా మనమే గెలుస్తా’మంటూ కొంత మంది చెబుతున్నా.. మరికొంత మంది మాత్రం మీరు గెలిచే చాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు. అలాగే.. చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే చేశాయి. జూన్ ఒకటి వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధమున్న పరిస్థితుల్లో ఆయా పార్టీలు, నాయకులు ఎగ్జిట్‌పోల్స్ చేసిన సంస్థలకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ సంస్థలు కూడా భిన్న అభిప్రాయాలను ఆవిష్కృతం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కలతో గడిపిన నాయకులు.. చివరకు ఎలా జరిగేదుంటే అలా జరుగుతుందంటూ సాయంత్రం కొంత మేరకు రిలాక్స్ అయినట్టు తెలుస్తున్నది.

పార్లమెంట్ పోలింగ్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకే ముగిసింది. అందుకు సంబంధించి ఈవీఎంలను రాత్రి రెండుగంటలవరకు కౌటింగ్ కేంద్రాలకు చేర్చారు. పెద్దపల్లి కౌటింగ్ కేంద్రాన్ని రామగిరి మండలంలోని జేఎన్టీయూలో.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌటింగ్ కేంద్రాన్ని శ్రీ రాజరాజేశ్వర (ఎస్సారార్) డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నిజకవర్గాల వారీగా సంబంధిత ఈవీఎంలను భద్రపరిచిన అధికారులు.. అక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మూడంచెల భద్రత కల్పించారు.
పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటిని ఉన్నతాధికారుల మొబైల్స్‌కు అను సంధానం చేశారు. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. క్షణాల్లో చేరుకునేలా భద్రాతా సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు పహారా కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫైరింజిన్లను అందుబాటులో ఉంచారు. కాగా, వచ్చే నెల 4న కౌటింగ్ ఉన్న నేపథ్యంలో అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
