న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా తీవ్రం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ రైడింగ్, డీజేలపై నిషేధాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేయనున్నారు. సో.. బీ కేర్‌ఫుల్..!!!
కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వే డుకలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 44 చోట్ల డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని, కరీంనగర్ మున్సిపల్ పరిధిలోనే 33 చోట్ల తనిఖీలు చేస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని, వాహనాలు వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి తనిఖీ పాయిం ట్ వద్ద 8 నుంచి 10 మంది సిబ్బంది బ్రీత్ అనలైజర్లు, బాడీ వార్న్ కెమెరాలతో విధుల్లో ఉంటారని తెలిపారు. ఎల్ఎండీ కట్టతోపాటు తీగల వంతెనపై పూర్తిగా వేడుకలు నిషేధించామని, వంతెనపైకి ఎవరూ వెళ్లకుండా పెట్రోలింగ్ వాహనాలు వినియోగిస్తున్నామని తెలిపారు.
డీజేలపై నిషేధం విధించామని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే వాటిని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని, బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చితే సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర శివారుల్లోని గెస్ట్‌హౌస్‌లు, ఫాంహౌస్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, డ్రగ్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన నార్కో టీమ్స్ జాగిలాలతోపాటు డిటెక్టివ్ కిట్స్‌ను వినియోగిస్తున్నామని, డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ జరిగితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్ప ష్టం చేశారు. ముఖ్యప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్, పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సీపీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.