దళితబంధు లబ్ధిదారులపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినా.. కాంగ్రెస్ ముఖ్యులు వచ్చినా దళితబంధు లబ్ధిదారులను నిర్బంధిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. తమకు రావాల్సిన రెండో విడుత ఆర్థికసాయం కోసం ప్రభుత్వాన్ని అడగడమే వీరి పాలిట శాపంగా మారింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పలుసార్లు నిరసనలు తెలిపిన దళితులపై ఇప్పటికే పలు కేసులు బనాయించిన పోలీసులు, తాజాగా సోమవారం నియోజకవర్గంలోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలో ముందస్తుగా అరెస్టులు చేసిన ఘటనలు దళిత వర్గాల్లో కలకలం రేపుతున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/ వీణవంక : దళితులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి సామాజిక అంతరాలను తొలగించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. వారికి ఇష్టమైన వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో స్థిరపడేలా ప్రోత్సహించింది. రాష్ట్రంలోనే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 18,021 దళిత కుంటుంబాలను గుర్తించింది. బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, ఒక్కొక్కరి ఖాతాల్లో 10 లక్షల చొప్పున జమ చేసింది. 10 వేలు దళిత సంక్షేమ నిధికి పోను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను బట్టి 9.90 లక్షల నుంచి 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో విడుదల చేసింది.
గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండో విడుత కింద నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నోటిఫికేషన్ రావడంతో నిలిచి పోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో 6,868 మందికి సంబంధించిన 256.76 కోట్లు, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్‌లో 1,280 మందికి 14.83 కోట్ల చొప్పున మొత్తం 8,148 మంది లబ్ధిదారులకు 271.60 కోట్లు రెండో విడుత కింద చెల్లించాల్సి ఉంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ ఖాతాలపై ఫ్రీజింగ్ విధించడంతో పది నెలలుగా ఒక్క పైసా విడిపించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఆందోళనలకు దిగితే నిర్బంధాలు
తమకు రావాల్సిన దళితబంధు ఆర్థికసాయం ఇవ్వాలని హుజూరాబాద్ దళితులు అనునిత్యం శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నారు. దళితుల సొమ్ము దళితులకే ఇవ్వాల్సిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపి ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తున్నది. దళితబంధు సాధన సమితి పేరిట లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న వేదికపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ ఆందోళన జరిగినా అక్కడికి వెళ్లి అరెస్టులు చేస్తున్నారు. ఫిబ్రవరిలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన దళితుల్లో ఐదుగురిపై వన్‌టౌన్ పోలీసులు కేసులు పెట్టారు.
హుజూరాబాద్‌లో రాస్తారోకో చేసినందుకు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా దళితబంధు సాధన సమితిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న లబ్ధిదారులపై దృష్టి పెట్టి, వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 6న దళితబంధు సాధన సమితి శాంతియుతంగా ఆందోళన చేసేందుకు నిర్ణయించుకున్న కార్యాచరణ పోలీసులకు చిక్కింది. ఈ డేట్స్ రాగానే క్రియాశీలకంగా ఉంటున్న లబ్ధిదారులను ముందుగానే అరెస్టు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. రాత్రంగా నిర్బంధిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో ఇప్పుడు ఏ దళితబంధు లబ్ధిదారుడిని ఎప్పుడు నిర్భంధిస్తారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. పోలీసుల నిర్బంధానికి వెరచిన దళితులు తమ కార్యాచరణ రద్దు చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతెందుకు నియోజకవర్గంలో మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఎవరు పర్యటించినా ఇప్పుడు దళితబంధు లబ్ధిదారులను పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. దళిత బంధు సాధన సమితిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్యుల్లో కొందరిని ఇప్పటి వరకు 15 సార్లు అరెస్టు చేసినట్లు ఒక లబ్ధిదారుడు తెలిపారు.
తాజా అరెస్టులతో మరింత ఆందోళన
పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని వాపోతున్న హుజూరాబాద్ దళితులు తాజా పరిణామాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని కార్యాచరణలో నిర్ణయించుకున్న దళితులను ప్రతి ఆదివారం రాత్రి అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజా, పరిణామాల ప్రకారం ఈ నెల 23న సోమవారం డిప్యూటీ సీఎంను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లాలని కార్యాచరణలో నిర్ణయించుకున్నారు. ఆయన అందుబాటులో లేక పోవడంతో దళితులు కరీంనగర్ కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు.
కానీ, ఆదివారం రాత్రి నుంచే దళితులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధించారు. ఈ పరిణామాలు హుజూరాబాద్ దళితవర్గాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. నియోజకవర్గానికి ఎవరు వచ్చినా తమను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, ఎక్కడైనా శాంతియుతంగా ఆందోళన చేసేందుకు ప్రయత్నించినా ముందుగానే నిర్బంధిస్తున్నారని దళితులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట మండలాల లబ్ధిదారులను ముందస్తుగా అరెస్టు చేసి సోమవారం మధ్యాహ్నం వదిపెట్టినట్లు దళితబంధు సాధన సమితి సభ్యులు కొలుపూరి నరేశ్, దాసారపు నాగరాజు వాపోయారు.
చింతకానికి ఇచ్చినట్లే మాకూ ఇవ్వండి
దళితబంధు హుజూరాబాద్‌లో పైలెట్‌గా అమలు చేశారు. ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో మాత్రం దళితబంధు రెండో విడుత ఆర్థిక సహాయం అందించి మాకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు. మేం దళితులం కాదా.. మాకు దళిత బంధు మంజూరు కాలేదా..? మేం ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఎవరికీ అనుకూలం కాదు. మా బతుకేందో మేం బతుకుతామని చెబుతున్నం.
మంత్రులను కలిసినా, అధికారులను కలిసినా మా పరిస్థితిని ఎవరు పట్టించుకోవడం లేదు. చింతకానిలో ఇచ్చినట్లే మాకూ ఇవ్వాలని అడుగుతున్నం. మరి మాకెందుకు ఇవ్వడం లేదు. చాలా మంది దళితుల పరిస్థితి దయనీయంగా ఉంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మా ఖాతాల్లో ఉన్న డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నం. మేము దొంగలం కాదు, దేశ ద్రోహులం కాదు, మమ్మల్ని ఎందుకు అరెస్టు చేసి స్టేషన్లలో నిర్బంధిస్తున్నరు. మేం చేసిన తప్పేమున్నది. న్యాయంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వమనే కదా అడుగుతున్నం.
– దాసారపు నాగరాజు, లబ్ధిదారుడు ( వీణవంక )