ముకరంపుర, సెప్టెంబర్ 23: కొత్తపల్లి మండలంలోని ఎలగందుల అనుబంధ గ్రామం బోనాలపల్లె మీదకు తూటాలు దూసుకొస్తుండడంపై ‘బోనాలపల్లెకు తూటా భయం!’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. సుమారు అరకిలోమీటర్ దూరంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ నుంచి తూటాలు గ్రామంలోని ఇండ్లపైకి దూసుకు రావడం.. ఈ నెల 20న ఇంటి ముందు అరుగుపై కూర్చున్న బోనాల అమృతమ్మ(85)కు తొడభాగంలో తాకి గాయం కావడం.. మరో ఇంటి పైకి బుల్లెట్ దూసుకొచ్చి రేకును చీల్చుకొని బియ్యం బస్తాల్లోకి దిగడం.. ఆ సమయంలో వంట చేస్తున్న గృహిణికి ముప్పు తప్పడాన్ని ‘నమస్తే’ వివరించింది. అలాగే వరుస ఘటనలతో గ్రామస్తులు వణికిపోతుండడాన్ని కండ్ల ముందుంచింది.
ఈ కథనం చర్చనీయాంశం కాగా, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తూటా తగిలి గాయపడి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందిన వృద్ధురాలు బోనాల అమృతమ్మ వివరాలను కుటుంబసభ్యుల ద్వారా కొత్తపల్లి ఠాణా పోలీసులు సేకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సైతం ఆరా తీసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు పల్లెవాసుల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించినట్టు తెలిసింది.
మరోవైపు బుల్లెట్ దూసుకువచ్చే వేగం, గుట్టపై ఉన్న బండరాళ్లు దాన్ని అడ్డుకునే తీరు వంటి వాటిని పరిగణనలోకి తీసుకునే శాస్త్రీయంగా ఎలగందుల శివారు ప్రాంతంలో ఫైరింగ్ రేంజ్ నిర్వహిస్తూ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో ఫైరింగ్ జరిగిన సమయంలో తూటాలు ఇండ్లకు దూరంగా గుట్ట సమీప ప్రాంతాల్లోనే పడేవని, ఇటీవలి కాలంలో ఇండ్లపైకి దూసుకొస్తున్నాయని బోనాలపల్లె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్ట నుంచి గ్రానైట్ వెలికి తీస్తుండడం వల్ల సహజంగా ఉన్న గుట్ట ఎత్తు క్రమంగా తగ్గిపోతున్నదని, బుల్లెట్లు తమ ఇండ్ల వైపు వస్తున్నాయని వాపోతున్నారు.