కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొందరు డాక్టర్లు నిర్వహించే క్యాంపుల వెనుక మాత్రం ఫార్మా కంపెనీల వ్యాపారం ఉంటున్నట్టు తెలుస్తున్నది.
ఉచిత క్యాంపులు నిర్వహిస్తే ఆ కంపెనీలు నజరానాలు ఇస్తూ.. ప్రతిగా సదరు వైద్యుల నుంచి బిజినెస్‌ను ఆశిస్తున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు దొరకకుండా రౌండ్ టేబుల్ మీట్స్ (ఆర్టీఎం), లంచ్ మీట్స్ పేరిట ఆఫర్లు ఇస్తున్నాయి. అంతెందుకు డాక్టర్లు నిర్వహించే నర్సింగ్ హోంలు, దవాఖానలకు అవసరమైన వైద్య పరికరాలు కూడా కొనిస్తున్నాయి. ప్రలోభాలకు లొంగుతున్న వైద్యులు, మందుల నాణ్యతను పరిశీలించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, ఆ కంపెనీలు మాత్రం కోట్లకు పడగెత్తుతున్నాయి.
కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఫార్మా కంపెనీల మాయలో పడుతున్న కొందరు వైద్యులపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఓ కన్నేసి ఉంచింది. ఫార్మా కంపెనీల నుంచి ఎలాంటి నజరానాలు తీసుకోవద్దని కొన్ని సడలింపులతో నిబంధనలు విధించింది. ప్రతి డాక్టర్ అకౌంట్స్‌పై ఓ కన్నేసి ఉంచింది. ముఖ్యంగా ఫార్మా కంపెనీల ప్రలోభాలకు చిక్కకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నది. అయితే మెడికల్ కాన్ఫరెన్స్‌లు ఉన్నప్పుడు ఫార్మా కంపెనీలు వైద్యులకు గదులు బుక్ చేసుకోవడంతోపాటు వైద్యుల సహకారంతో ఫార్మా కంపెనీలు మెడికల్ క్యాంపులు నిర్వహించుకునే అవకాశమున్నది.
వీటికి జీఎస్టీ కలిపి ఫార్మా కంపెనీలు వైద్యులకు చెల్లింపులు జరిపే ఆస్కారమున్నది. ఈ నిబంధనలనే బడా, చోట ఫార్మా కంపెనీల నిర్వాహకులు ఆసరా తీసుకుంటున్నారు. కొందరు వైద్యులకు నజరానాలు ఇచ్చి ఎక్కడా దొరక్కుండా చూసుకుంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి క్యాంపునకు వేలల్లో ఖర్చయినట్టు డాక్టర్ల నుంచి బిల్లులు తీసుకుంటూ చెల్లింపులు చేస్తున్నారు. కొందరు వైద్యులు క్యాంపులు నిర్వహించకున్నా ఫొటోలు క్రియేట్ చేసి సంబంధిత ఫార్మా కంపెనీలకు బిల్లులు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
కొన్ని ఫార్మా కంపెనీలు, కొందరు వైద్యులకు ఫెవికాల్ బంధాలు ఏర్పడుతున్నాయి. ఏండ్ల తరబడి ఒకే కంపెనీకి చెందిన ఉత్పత్తులను రోగులకు రాస్తున్న వైద్యులకు ఎన్ఎంసీ నిబంధనలు శరాఘాతంగా మారాయి. వీటిని అధిగమించేందుకు ఫార్మా కంపెనీలతో కలిసి కొందరు వైద్యులు తొక్కుతున్న అడ్డదారులు విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపుల విషయంలోనే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వైద్యులు ఎప్పుడో ఒకసారి క్యాంపులు నిర్వహిస్తుంటారు.
సేవా భావం ఉన్న డాక్టర్లు సొంత ఖర్చులతో గ్రామాల్లోనో.. పట్టణాల్లోని పేదల గల్లీల్లోనో క్యాంపులు నిర్వహిస్తుంటారు. కానీ, నజరానాలకు కక్కుర్తి పడే వైద్యులైతే క్యాంపులు నిర్వహించకున్నా ఫొటోలు, రికార్డులు క్రియెట్ చేసి ఫార్మా కంపెనీలకు బిల్లులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. 12 శాతం జీఎస్టీ చెల్లించి మరీ వైద్యులు ఇచ్చిన బిల్లులను ఫార్మా కంపెనీలు క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిజానికి ఇదంతా పరస్పర అవగాహనతోనే జరుగుతున్నా, కేవలం ఎన్ఎంసీ నిబంధనల నుంచి తప్పించుకునేందుకే ఇలా అడ్డదారులు తొక్కుతున్నట్టు స్పష్టమవుతున్నది.
విచిత్రం ఏమిటంటే కొన్ని పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలే ఈ రకంగా వైద్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. హానరేరియం (గౌరవ వేతనం) పేరిట క్యాంపులు నిర్వహించడం, వాటి తాలుకా బిల్లులు చెల్లించడం వైద్యుల కోసమే తప్పా రోగులపై ప్రేమతో కాదనేది స్పష్టమవుతున్నది. ఇటు కొన్ని చిన్న చిన్న ఫార్మా కంపెనీలు సైతం నాన్ హానరేరియం పేరిట తమ చెప్పు చేతల్లో ఉన్న వైద్యులకు ఇదే తరహాలో నజరానాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
చోట, బడా ఫార్మా కంపెనీలు వైద్యులను మచ్చిక చేసుకునేందుకు, తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు తమ ప్రలోభాల పర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. వైద్యులకు సంబంధించిన నర్సింగ్ హోంలు, కార్పొరేట్ దవాఖానలకు అవసరమైన విలువైన ఎక్విప్మెంట్స్ కూడా సమకూర్చుతున్నట్టు తెలుస్తున్నది. వైద్యులకు ఉన్న అప్పులకు సంబంధించిన ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
అంతే కాకుండా రౌండ్ టేబుల్ మీటింగ్స్ (ఆర్టీఎం) పేరిట వైద్యులకు పెద్ద మొత్తంలోనే నజరానాలు అందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక దవాఖానలో పనిచేస్తున్న వారందరికీ నెలకో, రెన్నెళ్లకో ఓ సారి లంచ్ మీట్లు కూడా నిర్వహిస్తుంటాయి. ఖరీదైన హోటళ్లలో లక్షలు ఖర్చు చేస్తూ లంచ్‌లు, డిన్నర్లు ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల పరిధిలోకి రాని ఇలాంటి విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కాన్ఫరెన్స్‌లను కూడా ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి వైద్యులకు పెద్ద మొత్తంలోనే ముట్ట జెబుతున్నట్టు తెలుస్తున్నది.
ఇటు వైద్యులైనా.. అటు ఫార్మా కంపెనీలైనా రోగులను దోచుకోవడమే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీల ప్రలోభాలకు గురవుతున్న కొందరు వైద్యులు, మందుల నాణ్యతను పరిశీలించకుండా ఎంత కమీషన్ ఇస్తారు? ఏ రూపంలో నజరానాలు ఇస్తారు? అనే విషయానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రోగుల ఆరోగ్యాల గురించి ఆలోచించకుండా ఆ కంపెనీలు చెప్పిన మందులనే రోగులకు రాయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవి సబ్స్ట్యూట్వా, అన్ బ్రాండెడ్వా అని చూడకుండా మందులు ఎలాంటివైనా రోగులకు అంటగడుతూ కొందరు విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారు. డబ్బే ప్రధానంగా భావిస్తూ వైద్య వృత్తికి కలంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇటు ఫార్మా కంపెనీల నిర్వాహకులు రోగుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకుంటూ రోజురోజుకు కోట్లకు పడగెత్తుతున్నారు.