కరీంనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జన సమీకరణపై మంగళవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షత వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించినట్లే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు మరోసారి సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ స్థాపించి 25 ఏండ్లు గడుస్తున్న నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి 10 వేలకుపైగా జనాన్ని తరలించాలని, సభను సక్సెస్ చేసి, బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. ఒక్క కరీంనగర్ నియోజకవర్గం నుంచే 10 వేల మందిని తరలించాలి. సభను కనీవినీ ఎరుగని రీతిల్లో సక్సెస్ చేద్దాం. మరోసారి మన సత్తాచాటుదాం.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ అంటే కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఉద్యమ సమయంలో 2001లో పార్టీని స్థాపించిన తర్వాత సింహగర్జన పేరుతో నగరంలోనే భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తుండగా అల్గునూర్‌లో అరెస్టయిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా రైతుబంధు, దళిత బంధు వంటి అనేక ముఖ్య పథకాలను ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రారంభించారన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి, ప్రజలను కదిలించి ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. 1969 మాదిరిగానే ఉద్యమం కనుమరుగయ్యేదని, ఛత్తీస్‌గఢ్ మాదిరిగా తెలంగాణ కూడా వెనుకబడి కరెంట్, నీళ్లు, నిధుల కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడక ముందు కరీంనగర్ ఎట్లుండేదని? ఇప్పుడెలా అభివృద్ధి చెందిందో గమనించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడి మన నిధులు, నీళ్లు, మనకు రావడమే అందుకు కారణమని, తెలంగాణ రావడానికి మూల కారణం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని ఉద్ఘాటించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోక ఆగమాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుంటుపడిపోయింది. పూర్తిగా గాడి తప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీలేదు. పాలనపై ప్రజలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నరు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలను నమ్మి తాము మోస పోయామని భావిస్తున్నరు. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
అధికారంలో ఉన్న పార్టీకి అడ్డంకులు సృష్టించవద్దని కేసీఆర్ కూడా తమకు చెప్పారన్నారు. కానీ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు అధికార గర్వంతో ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా.. లాగులో తొండలు జొప్పిస్తా.. కాళ్ల కిందేసి తొక్కుతా’నని వ్యాఖ్యానిస్తున్నారని, ఆయన కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిందని, అధికారం కోల్పోయినా ప్రజల వెంటనే ఉంటోందని, తమకు ఓట్లు వేయలేదని ప్రజలను ఏనాడు పట్టించుకోకుండా ఉండలేదన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కరీంనగర్ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు, పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేని మధు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు సాబీర్ బాషా, దుర్శేడు సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ నర్సయ్య,పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ సెల్ నగర శాఖ అధ్యక్షుడు మీర్ షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి నవాజ్ హుసేన్, యువజన విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 8 : వరంగల్ జిల్లాలో ఈ నెల 27 నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో కదిలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. మంగళవారం యూసుఫ్‌నగర్ గ్రామంలో గోడలపై స్వయంగా వాల్ రైటింగ్ చేసి వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలించిదని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు వనరులను దోచుకుంటూ తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని ఆగమాగం చేశారని ధ్వజమెత్తారు. రజతోత్సవ మహాసభలో అధినేత కేసీఆర్ భవిష్యత్‌పై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. నియోజకవర్గం నుంచి 10వేల మందితో సభకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పట్టణ, మైనార్టీ అధ్యక్షుడు ఎండీ ఫహీం, నాయకులు ఎనుగందుల సత్యనారాయణగౌడ్, పిడుగు సందయ్య, అన్వర్, పొట్ట సురేందర్, తుక్కారెడ్డి, బర్ల సుదీర్, బాబురావు, అచ్చ చంద్రశేకర్, రఘు, కల్యాణ్, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల/జగిత్యాల రూరల్/ ఏప్రిల్ 8: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తరలిరావాలని, విజయవంతం చేయాలని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కాగా, మంగవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల యూసుఫ్‌నగర్‌లో గోడలపై స్వయంగా వాల్ రైటింగ్ చేసి వినూత్న ప్రచారం చేపట్టారు. అలాగే జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అర్బన్ మండలం తిప్పనపేటలో వాల్ రైటింగ్ రాయించారు. బీఆర్ఎస్ సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.