రామగిరి, డిసెంబర్ 19 : సింగరేణి అర్జీ–3 పరిధిలోని ప్రభావిత గ్రామాల్లో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాల లోపాలను వెంటనే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిని పక్కనపెట్టి బొగ్గు గనుల విస్తరణ చేపట్టడం అన్యాయమని స్పష్టం చేశారు. రామగిరి జేఎన్టీయూ కళాశాల మైదానంలో కోల్ మైన్స్ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్‌తో పాటు పర్యావరణ శాఖ, సింగరేణి సంస్థకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి మౌలిక వసతులు ఇప్పటికీ సరైన స్థాయిలో లేవని ప్రభావిత గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గనుల విస్తరణ వల్ల దుమ్ము, కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా ప్రభావిత గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టి, ఆ తర్వాతే గనుల విస్తరణకు అనుమతించాలని కోరారు.
ప్రతీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటది.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఈ అంశాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్థులు వ్యక్తం చేసిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. తాగునీరు, రహదారులు, వైద్య సదుపాయాలు, ఉపాధి వంటి సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కార చర్యలు చేపడతాం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పూర్తిగా నమోదు చేసి, పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రశాంతంగా ముగియగా, గ్రామాల అభివృద్ధిపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు మరోసారి విజ్ఞప్తి చేశారు.