Election promises | ఓదెల, సెప్టెంబర్ 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల తాహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వికలాంగులు, వృద్ధులు తహసిల్దార్ కార్యాలయానికి తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లతో తహసీల్దార్ ధీరజ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఐరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకుడు రాసపల్లి రవికుమార్, కొమురయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.