వేములవాడ బల్దియా గాడి తప్పింది. కరెంట్ బిల్లుల చెల్లింపులో అప్రతిష్టను మూటగట్టుకున్నది. ప్రజల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నా.. బకాయి చెల్లింపులో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఏడాది కాలంలో సిరిసిల్ల సెస్‌కు 7.20కోట్ల బకాయి పడింది. అయితే బాకీ తీర్చేందుకు మున్సిపల్ యంత్రాంగం, ఇప్పటి వరకు కోటీ91లక్షల చెకులు ఇచ్చినా డబ్బులు జమకాకపోవడం, మరోవైపు నెలనెలా చార్జీలు తడిసిమోపెడవుతుండడంతో రాబట్టుకోవడం సెస్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
వేములవాడ, మార్చి 19: వేములవాడ మున్సిపాలిటీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయిలో రాణించి అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నది. కానీ, కొద్ది రోజులుగా పాలన గాడి తప్పింది. అస్తవ్యస్తంగా తయారైంది. కరెంట్ బిల్లుల మొండి బకాయి జాబితాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వేములవాడ పురపాలక సంఘం పరిపాలనలో భాగంగా అనుబంధ గ్రామాలతో కలిపి 250 విద్యుత్ సర్వీసులున్నాయి. దాదాపు ప్రతినెలా 16లక్షల నుంచి 20 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అయితే 2023 సంవత్సరం నుంచి తరచూ పెరిగిన బకాయిలు ఇప్పుడు భారంగా మారి కోట్లకు చేరాయి. ఇటీవల సెస్ విద్యుత్ అధికారులు ఫిబ్రవరి నాటికి 6కోట్ల 7లక్షల, 37వేల 314 బకాయి ఉందని పేర్కొనగా, మార్చి నాటికి 7కోట్ల 20లక్షలకు చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా, తాము దశలవారీగా బాకీలు చెల్లిస్తున్నామని మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు.
వేములవాడ పురపాలక సంఘం విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ట్రెజరీ చెకులను సెస్ అధికారులకు అందజేస్తున్నది. 2025 జనవరిలో కోటి 12లక్షల 91వేల 678.. జూన్‌లో 39,53,112.. జూలైలో 19,72,285.. ఆగస్టులో 19,72,333.. అంటే మొత్తం కోటీ 91లక్షల 89వేల 408 విలువైన చెకులను మున్సిపల్ అధికారులు సంబంధిత సెస్‌కు అందించారు. ఏడాది గడుస్తున్నా ఒక్క చెక్కు నగదు మాత్రం జమ కాలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
అయితే తాజాగా మార్చి 7న మరో 50లక్షలు ట్రెజరీ చెకును అందజేశారు. దీంతో ఇప్పటివరకు 2కోట్ల 41లక్షల బిల్లు చెక్కుల రూపంలో చెల్లించగా, మరో 4కోట్ల 73లక్షల బకాయి ఉన్నట్టు సెస్ అధికారులు తెలిపారు. అయితే సంబంధిత మున్సిపల్ ట్రెజరీ చెక్కులు రాష్ట్ర ఆర్థిక శాఖ వరకు వెళ్తున్నాయి. వాటిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లించాల్సి ఉంటుంది. చెక్కులు ఇస్తున్నప్పటికీ నగదు సెస్ విద్యుత్ కార్యాలయానికి జమ కాకపోవడంతో అత్యధికంగా విద్యుత్ బకాయిలు ఉన్న మున్సిపాలిటీగా వేములవాడ రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచినట్టు అధికారులు చెబుతున్నారు.
వేములవాడ మున్సిపాలిటీ సెస్‌కు అత్యధికంగా విద్యుత్ బకాయి పడ్డది బకాయిలు వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి మాపై ఒత్తిడి వస్తున్నది. అయితే ట్రెజరీ చెకులు ఇస్తున్నా నగదు మాత్రం జమ కావడం లేదు. గతేడాది జనవరిలో ఇచ్చిన చెక్కు ఇప్పటి వరకు నగదు జమ కాలేదు. మార్చి నాటికి 7కోట్ల 20లక్షల బకాయి ఉన్నట్టు నోటీసులు జారీ చేస్తున్నాం.
– గంగాధర్, ఏడీఈ సబ్ డివిజన్ (వేములవాడ)
విద్యుత్ బకాయిలు చాలాకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే సెస్‌కు కోటి 91లక్ష చెకులు ఇచ్చాం. ఇటీవల మరో 50 లక్షల చెక్కు అందజేశాం. ఏప్రిల్ తర్వాత మరికొంత నగదును చెల్లిస్తాం. దశలవారీగా బాకీలు మొత్తం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ (వేములవాడ)