అక్రమ రవాణా నియంత్రణకు పెద్దపల్లి సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, బసంతనగర్, కాల్వ శ్రీరాంపూర్, పోత్క పల్లి, జూలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. బ్రీత్ ఆనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి మద్యం సేవించిన వారి వాహనాలను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేశారు.
అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో గంజాయి గుట్కాతో పాటు నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిషేధిత ఉత్పత్తులను ఎవరు రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.