Special camp | పెద్దపల్లి, జూన్11: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్ మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ్ మహా అభియాన్), డీఏజేజీయూఏ ( ధరతి ఆభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టిందని అందులో భాగంగా జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్న మంథని మండలం బట్టుపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామని తెలిపారు.
జూన్ 20న నిర్వహించే క్యాంపులో ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్రాలలో టీచర్, హెల్పర్ అందుబాటులో ఉన్నారా లేదా పరిశీలించాలని, లేనిపక్షంలో ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం కింద 100 శాతం టీకాలు వేయించాలన్నారు. జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని, పీఎం విశ్వకర్మ ముద్ర స్టాండప్ ఇండియా వంటి వివిధ పథకాల కింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు సూచించారు.
పోడు భూముల కింద పట్టాలు జారీ చేసిన లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఇందిరా గిరి సౌర జల వికాసం పథకం పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మంథని ఆర్డీవో సురేష్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే సంగీత, జిల్లా అటవీ అధికారి శివయ్య, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.