వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు
మొదటి డోస్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలి
డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 25: కొవిడ్ వ్యాప్తి ఉధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, తద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో జువేరియా పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 113 మందికి టీకా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేసి కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయని, అలాంటి దానిపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. అలాగే మొదటి డోస్ తీసుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొవిడ్ టీకా వేస్తారన్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వైద్యశాలకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెప్పారు. ఇందుకు కొవిన్ 2.0 యాప్ ద్వారా లేదా COWIN.gov.in వెబ్సైట్లో ఫోన్ నంబర్ నమోదు చేయాలని తెలిపారు. లేదా నేరుగా వైద్యశాలకు వచ్చి సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొవిడ్ టీకా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, పట్టణంలోని మారుతీనగర్‌లో పలువురికి కరోనా పాజిటివ్ రాగా, చుట్టు పక్కల వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్యులు, చెల్పూర్ పీహెచ్సీ పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.